సాగర తీరాన భారతీయ కళా వైభవం
ఏయూక్యాంపస్: విశాఖ సాగర తీరాన భారతీయ కళల గొప్పదనాన్ని చాటిచెప్పేలా లైట్‌హౌస్ ఫెస్టివల్ శుక్రవారం కనులపండువగా ప్రారంభమైంది. బీచ్‌రోడ్డులోని ఎం.జి.ఎం పార్క్ వేదికగా నిర్వహిస్తున్న రెండు రోజుల మూడవ భారతీయ లైట్‌హౌస్ ఫెస్టివల్‌ను కేంద్ర పోర్టు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్‌తో కలిసి పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రోడ్డు మార్గం కంటే సముద్రయానం ప్రాచీనమైనదని, వీటిలో ఓడరేవులు, లైట్ హౌస్‌లు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయన్నారు. దేశ ప్రజలు ముందుగా దేశీయంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని, ఇండియా టూరిజంను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఉన్న 205 లైట్ హౌస్‌ల్లో 75ను అభివృద్ధి చేసి లైట్ హౌస్ టూరిజంను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా ఏపీలో 110 కార్యక్రమాలను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఎకో, అడ్వెంచర్, క్రూజ్ టూరిజంను ప్రారంభించామన్నారు. టెంపుల్ టూరిజం సైతం బాగుందని, పర్యాటక రంగం ఉపాధి అవకాశాలను పెంచుతోందన్నారు. ఉత్సవంలో భాగంగా మణిపూర్ (పుంగ్ చోళం), అరుణాచల్ ప్రదేశ్ (గాలో డ్యాన్స్), మిజోరం (చెరావ్), త్రిపుర (సంగ్రైన్), మేఘాలయ (వంగలా), నాగాలాండ్ (కబూయి), సిక్కిం (మరౌని), అస్సాం (బిహు) జానపద నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫెస్టివల్‌లో ఏర్పాటు చేసిన హస్తకళలు, సంప్రదాయ వస్త్రాలు, చెక్క బొమ్మలు, చిత్రకళ, వివిధ రకాల ఆహార పదార్థాల స్టాల్స్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ స్టాల్స్‌ను కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ ప్రారంభించి తిలకించారు. అనంతరం ప్రదర్శనను వీక్షించడానికి వచ్చిన పాఠశాల విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో పోర్టు ట్రస్ట్ చైర్మన్ అంగముత్తు, డీజీఎల్‌ఎల్ ఎన్.మురుగానందన్, ఎంపీ సీఎం రమేష్, మేయర్ పీలా శ్రీనివాస రావు, ఎమ్మెల్యేలు వంశీ కృష్ణ, పి.విష్ణుకుమార్ రాజు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకుంటున్న లైట్‌హౌస్ ఫెస్టివల్
సాగర తీరాన భారతీయ కళా వైభవం
సాగర తీరాన భారతీయ కళా వైభవం


