నిద్రలేచిన ఏపీపీసీబీ, రవాణా శాఖ!
ఇన్నాళ్లూ అవే పరిశ్రమలు, అదే కాలుష్యం వెదజల్లుతున్నా.. కనీస తనిఖీలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరిస్థితుల చేయి దాటిన తర్వాత ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ), జిల్లా రవాణా శాఖ అధికారులు నిద్రలేచారు. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం కమిటీలు వేయడంతో హడావుడి మొదలు పెట్టారు. గత డిసెంబర్ 21 నుంచి పరిశ్రమల్లో తనిఖీలు మొదలుపెట్టారు. నిబంధనలు పాటించని ఏడు పరిశ్రమలను గుర్తించి రూ.10 కోట్ల జరిమానాలు విధించారు. ఇన్నాళ్లూ ఈ పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే ఏపీపీసీబీ మొద్దు నిద్ర వ్యవహరించిందా? అనే విమర్శలొస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి బాటలోనే జిల్లా రవాణాశాఖ అధికారులు నడిచారు. ఇప్పుడు చలానాలు వేయడం మొదలెట్టారు. డిసెంబర్ 21 నుంచి ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ పేరుతో తనిఖీలు మొదలుపెట్టి.. 32 వాహనాలపై ఓవర్ లోడింగ్, 69 వాహనాలపై పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని, టార్పాలిన్ లేకుండా.. దుమ్ము ధూళి లోడింగ్‌తో వెళ్తున్న 58 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.17.54 లక్షల జరిమానా విధించారు. జీవీఎంసీ అధికారులు కూడా కాలుష్య నియంత్రణ కోసం జూలు విదిల్చామని చెప్పేందుకు 10 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల్ని ఏర్పాటు చేశారు. ఇంతవరకూ ఈ బృందాలు ఏం చేశాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారింది.


