వీఐపీలకు ఇక ప్రత్యేక సమయం
సింహగిరిపై మల్టీలెవెల్ పార్కింగ్
రెండో ఘాట్ రోడ్డు పొడిగింపునకు
ప్రణాళికలు
నెలాఖరుకు ‘ప్రసాద్’ పనులు పూర్తి
ఇన్‌చార్జి కమిషనర్ రామచంద్రమోహన్
సింహాచలం: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు వందశాతం సంతృప్తికరమైన సేవలు అందించడమే లక్ష్యమని, ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని రాష్ట్ర దేవదాయశాఖ ఇన్‌చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ తెలిపారు. మంగళవారం ఆయన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని, ‘ప్రసాద్’ పథకం పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా, ప్రోటోకాల్ వీఐపీల దర్శనాలకు ప్రత్యేక సమయాలు కేటాయిస్తామని, ఆ సమయంలోనే వారు రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సింహాచలం, విజయవాడ ఆలయాల్లో పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవెల్ పార్కింగ్ భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సింహగిరి రెండో ఘాట్ రోడ్డును(పాత అడవివరం వైపు నుంచి) కొండపై వరకు పొడిగించే ప్రతిపాదనలు చేశామన్నారు. సింహాచలంలో ప్రసాద్ పథకం పనులు నెల రోజుల్లో పూర్తవుతాయని, మెట్ల మార్గం పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. కొండ దిగువన వరాహ పుష్కరిణి వద్ద తలనీలాల కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రసాదాల నాణ్యత, పరిమాణం, పారిశుధ్యంపై ఎస్‌వోపీలను అమలు చేస్తున్నామని, అన్నప్రసాదం నాణ్యత పరిశీలనకు ఇద్దరు అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 22 ఆర్జేసీ, డీసీ హోదా కలిగిన ఆలయాల ఈవోలతో ఎస్‌వోపీలు అమలుపై ప్రతి రెండు వారాలకోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎన్‌ఎంఆర్‌ల పర్మినెంట్ విషయంలో నిషేధం ఉందని, కొన్ని చోట్ల కోర్టు ఉత్తర్వుల మేరకు ఇవ్వడం జరుగుతోందన్నారు.
పులిహోరలో నత్త వచ్చిందన్న ఆరోపణపై విచారణ జరుగుతోందని, తప్పులు జరిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలని భక్తులను కోరారు. ఆ భక్తుడిపై చర్యలు తీసుకునే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. శ్రీనివాసనగర్‌లో కొత్తగా నిర్మించిన కల్యాణ మండపాలను నెలలోపు అందుబాటులోకి తేవాలని, భద్రత కోసం మెటల్ డిటెక్టర్లు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. భైరవవాక ఆలయ రహదారి నిర్మాణంపై అటవీశాఖతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట దేవస్థానం ఇన్‌చార్జి ఈవో సుజాత, ఈఈ రమణ, ఏఈవోలు ఉన్నారు.
06విఎస్‌సి95–320092,06విఎస్‌సి95ఎ–320092: వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి బృందంతో కేజీహెచ్ సూపరిండెంటెంట్ వాణి, వైద్యులు


