నవభారత దీప్తి.. యువతకు స్ఫూర్తి
ఘనంగా వివేకానంద శోభాయాత్ర
ఏయూక్యాంపస్/డాబాగార్డెన్స్: స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఆధ్వర్యంలో బుధవారం నగరంలో ఘనంగా శోభాయాత్ర జరిగింది. విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ యాత్ర రెడ్నం గార్డెన్స్, రాఘవేంద్రస్వామి ఆలయం డౌన్ రోడ్డు, సెవెన్ హిల్స్ ఆస్పత్రి, హోటల్ గ్రీన్‌పార్క్, నౌరోజీ రోడ్డు, నోవాటెల్ మీదుగా ఆర్కే బీచ్‌లోని రామకృష్ణ మిషన్ ఆశ్రమం వరకు సాగింది. ర్యాలీలో భారీ వివేకానందుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు క్రమశిక్షణతో కవాతు చేస్తూ, వివేకానందుని సూక్తులు రాసిన ప్లకార్డులు చేతబూని నినదించారు. పలువురు చిన్నారులు వివేకానందుని వేషధారణలో అలరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ.. నవభారత దీప్తిగా, యువతరానికి నిత్య స్ఫూర్తిగా స్వామి వివేకానంద నిలుస్తారని కొనియాడారు. భారతీయ యువతను మేల్కొలిపి, వారిని కార్యోన్ముఖులను చేసిన ఘనత ఆయనదేనన్నారు. ఆత్మవిశ్వాసం, మనోధైర్యాన్ని పెంపొందించే వివేకానందుని ప్రసంగాలు, సూక్తులు నేటి తరానికి దిక్సూచిలాంటివని, ప్రతి ఒక్కరూ వాటిని చదవాలని పిలుపునిచ్చారు. నేవల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. వివేకానందుని సందేశాల సారాన్ని అందిపుచ్చుకుని, భారతీయ యువత దేశభక్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రామకృష్ణ ఆశ్రమం కార్యదర్శి స్వామి స్వసంవేద్యానంద మాట్లాడుతూ.. దేశాన్ని ప్రేమించడంతో పాటు సేవ చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. యువత కోసం వివేకానందుడు ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఆశ్రమ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ రాజు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యువజన, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


