చెత్త కొండలు
దర్శనమిస్తున్న వందల టన్ను చెత్తకుప్పలు
మూలకు చేరిన క్లోజ్‌డ్ కాంపాక్టర్ వాహనాలు కనీసం పట్టించుకోని కమిషనర్, మేయర్ వచ్చే నెలలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ప్రారంభం చెత్తమయంతో విశాఖ పరువు తీస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
టౌన్ కొత్తరోడ్డులోని సీసీఎస్‌లో చెత్త కుప్పలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
నగరంలోని వివిధ క్లోజ్‌డ్ కంపాక్షన్ సిస్టం (సీసీఎస్) ప్రాజెక్టుల నుంచి చెత్తను సేకరించి కాపులుప్పాడలోని చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంటుకు తరలించాల్సి ఉంటుంది. ఒకవైపు ఈ వాహనాలు నెలల తరబడి షెడ్డకు, పోలీసుస్టేషన్లలో ఉండటంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి ఉంటోంది. వచ్చే నెల మధ్య నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ప్రారంభం కానుంది. ఈ సమయంలో కూడా ఈ వ్యవహారంపై జీవీఎంసీ కమిషనర్, మేయర్ కనీసం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగరాన్ని చెత్తమయంగా చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వాస్తవానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో జీవీఎంసీకి గార్బేజ్ ఫ్రీ సిటీ(జీఎఫ్‌సీ)లో 3 స్టార్ అవార్డు లభించింది. 2022లో దేశంలోనే 4వ క్లీన్‌సిటీ అవార్డును సొంతం చేసుకుంది. అంతేకాకుండా అదే సంవత్సరంలో జీఎఫ్‌సీలో 5 స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. ఇప్పుడు ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తకుప్పలు కాదు.. కొండలను చూస్తే జీవీఎంసీ గార్బేజ్ సిటీ కేటగిరీలో అవార్డు దక్కించుకునే అవకాశం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎక్కడి చెత్త అక్కడే...!
వాస్తవానికి నగరంలోని గాజువాక, ముడసర్లోవ, చీమలాపల్లి, టౌన్ కొత్త రోడ్డు ప్రాంతాల్లో క్లోజ్‌డ్ కాంపాక్షన్ సిస్టం (సీసీఎస్) ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుతం ఆయా సీసీఎస్ ప్రాజెక్టుల వద్ద వందల టన్నుల చెత్త పేరుకుపోయి దర్శనమిస్తోంది. జీవీఎంసీ పరిధిలో ప్రతీ రోజూ 1,200 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇంటింటా క్లాప్ వాహనాల ద్వారా సేకరించిన చెత్తను ఈ సీసీఎస్ ప్రాజెక్టుల వద్దకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి క్లోజ్‌డ్ కాంపాక్టర్ల ద్వారా కాపులుప్పాడలోని చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంటుకు నేరుగా తరలించాల్సి ఉంటుంది. అక్కడ కూడా కిందపడేయకుండా నేరుగా ప్లాంటులోని బాయిలర్‌కు ఫీడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇలా ఒకవైపు సీసీఎస్ ప్రాజెక్టుల నుంచి చెత్తను సేకరించాల్సిన వాహనాలు ఎక్కడికక్కడ ఉండిపోవడంలో చెత్త కుప్పలు పెద్ద కొండల్లా దర్శనమిస్తున్నాయి. వీటి దుర్గంధంతో నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిబ్రవరి నెలలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ప్రారంభంకానున్న తరుణంలో ఈ చెత్తకుప్పలు కాస్తా జీవీఎంసీ ర్యాంకింగ్‌ను చెత్తమయం చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
యాక్సిడెంట్లు అవుతున్నా..!
చెత్తను తరలించే క్లోజ్‌డ్ కాంపాక్టర్ వాహనాలు గతంలో ఒకటి 2025లో మూడు యాక్సిడెంట్లు చేశాయి. ఈ వాహనాలు పదే పదే యాక్సిడెంట్లు అవుతున్నా.. డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సదరు డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడుపుతున్నారని తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. అలాగే ఈ సీసీఎస్ వాహనాలకు ఇన్సూరెన్స్ కూడా సకాలంలో చెల్లించడం లేదు.
పర్యటనలు ఏవీ..!
గతంలో కమిషనర్, మేయర్ ఇద్దరూ కలిసి తెల్లవారుజామునే ఏదో ఒక వార్డులో పర్యటించేవారు. వీధులు, రోడ్లను కార్మికులు ఎలా శుభ్రం చేస్తున్నారు? అందరూ హాజరయ్యారా? లేదా అనే అంశాలను ఆరా తీయడంతో పాటు చెత్త కనపడితే సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను మందలించేవారు. ఇలా నెలలో వీలైనన్ని ఎక్కువ రోజులు కలిసి పర్యటన చేసేవారు. మేయర్‌గా పీలా శ్రీనివాసరావు, కమిషనర్‌గా కేతన్ గార్గ్ వచ్చిన తర్వాత కలిసి పర్యటించిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇరువురి మధ్య అంతగా సఖ్యత లేదన్న వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. ఇది కాస్తా జీవీఎంసీలోని కిందిస్థాయి అధికారులకు అలుసుగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గాజువాక డంపింగ్ యార్డు నుంచి చెత్తను తీసుకువెళ్లే ఏపీ39డబ్ల్యూ7138 నెంబరు గల క్లోజ్‌డ్ కాంపాక్టర్ వాహనం నడుపుతున్న డ్రైవర్ కంచరపాలెం స్టేషన్ పరిధిలో గత డిసెంబర్ 9వ తేదీన యాక్సిడెంట్ చేశాడు. రాత్రి 1.30 గంటల సమయంలో జరిగిన ఈ యాక్సిడెంట్‌లో ఒక వ్యక్తి మరణించారు. సదరు వాహనం ఇన్సూరెన్స్ డిసెంబర్ 8వ తేదీన ముగిసింది. కనీసం ఈ వాహనానికి ఇన్సూరెన్స్ కూడా జీవీఎంసీ అధికారులు రెన్యూవల్ చేయలేదు. ఈ వాహనం ఇప్పటికీ పోలీసు స్టేషన్‌లోనే ఉంది.
మరో క్లోజ్‌డ్ కాంపాక్టర్ గత 14 నెలలుగా మరమ్మతుల పేరుతో ఇప్పటికీ ఇంకా షో రూంలోనే ఉంది. ఈ వాహనానికి కూడా ఇన్సూరెన్స్ లేదు. మరమ్మతులకు లక్షల్లో ఖర్చు అవుతుండటంతో ఈ భారాన్ని ఎవరు భరించాలనే విషయంపై ఇప్పటికీ తర్జనభర్జన నడుస్తూనే ఉంది.


