యోగా డే నాడు మొబైల్‌ టాయిలెట్ల మొత్తం అద్దె రూ.1.60 కోట్లు టెండర్లు లేకుండానే నామినేషన్‌ పద్ధతిలో అప్పగింత ప్రధాని కర్నూలు పర్యటనలోనూ అదే తీరు రాష్ట్రంలో ఎక్కడ పర్యటనలు జరిగినా ఒకే కాంట్రాక్టరుకు అప్పగింత పనులన్నీ గుంటూరుకు చెందిన టీడీపీ నేతకే... | - | Sakshi
Sakshi News home page

యోగా డే నాడు మొబైల్‌ టాయిలెట్ల మొత్తం అద్దె రూ.1.60 కోట్లు టెండర్లు లేకుండానే నామినేషన్‌ పద్ధతిలో అప్పగింత ప్రధాని కర్నూలు పర్యటనలోనూ అదే తీరు రాష్ట్రంలో ఎక్కడ పర్యటనలు జరిగినా ఒకే కాంట్రాక్టరుకు అప్పగింత పనులన్నీ గుంటూరుకు చెందిన టీడీపీ నేతకే...

Jan 7 2026 7:16 AM | Updated on Jan 7 2026 7:16 AM

యోగా డే నాడు మొబైల్‌ టాయిలెట్ల మొత్తం అద్దె రూ.1.60 కోట

యోగా డే నాడు మొబైల్‌ టాయిలెట్ల మొత్తం అద్దె రూ.1.60 కోట

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :

యోగా డే మాటున చంద్రబాబు సర్కారు దోపిడీకి ప్రణాళిక రచించింది. అనుంగుడైన కాంట్రాక్టరుకు మొబైల్‌ టాయిలెట్ల అద్దె రూపేణా అడ్డంగా దోచిపెట్టేందుకు స్కెచ్‌ వేసింది. పైగా ఆ కాంట్రాక్టరు గుంటూరుకు చెందిన టీడీపీ నేతే కావడం గమనార్హం. ఇండియా మార్ట్‌లో కేవలం రూ.2 వేలకే మొబైల్‌ టాయిలెట్‌ను అద్దెకు సరఫరా చేస్తామని కేకేవీఎస్‌ ఆగ్రోటెక్‌ కంపెనీ ప్రకటిస్తుంటే.. కేకేవీఎస్‌ గ్రీన్‌ వెంచర్స్‌ నుంచి జీవీఎంసీ ఏకంగా రూ.16,200 అద్దె చెల్లించేందుకు పనులను అప్పగించడం యోగా డే మరుగున దోపిడీ బాగోతాన్ని బహిర్గతం చేసింది. మరీ విచిత్రమేమంటే కేకేవీఎస్‌ ఆగ్రోటెక్‌, కేకేవీఎస్‌ గ్రీన్‌ వెంచర్స్‌ కంపెనీలు రెండూ ఒకేటే కావడం. గత అక్టోబరు 16న కర్నూలులో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమం సందర్భంగా కూడా ఒక్కో టాయిలెట్‌కు అద్దె రూ.6,900 చొప్పున చెల్లించారు. ఇవే కాదు రాష్ట్రంలో ఎక్కడ ప్రధాని పర్యటన జరిగినా.. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనలకై నా... యోగా డే... ఇలా ఏ కార్యక్రమమైనా మొబైల్‌ టాయిలెట్ల సరఫరా కాంట్రాక్టు మాత్రం గుంటూరుకు చెందిన టీడీపీ నేతకే దక్కుతున్నాయి. ఒకవేళ టెండరులో వేరే సంస్థ పనులు దక్కించుకున్నా.. ఉన్నతాధికారుల ఒత్తిడితో పనులు చేసేది మాత్రం సదరు టీడీపీకి చెందిన సంస్థే అని తెలుస్తోంది. దీంతో కార్యక్రమాన్ని బట్టి ఒక్కోసారి ఒక్కో ధరను ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు సంస్థ వసూలు చేస్తోంది. గత ఏడాది జూన్‌ 21న యోగా డే పేరుతో విశాఖలో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా ఒక్కో మొబైల్‌ టాయిలెట్‌కు పెట్టిన ఖర్చు చూస్తే ఏకంగా కొత్త టాయిలెట్‌ కొనడమే కాదు.. మరో రూ.4 వేలు వెచ్చిస్తే ఏకంగా శాశ్వతంగా టాయిలెట్లను నిర్మించవచ్చననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పలు కంపెనీల పేర్లతో మాయాజాలం

ఒక్క యోగా డే పేరుతో నామినేషన్‌ పద్ధతిలో జీవీఎంసీ మొబైల్‌ టాయిలెట్ల అద్దె పేరుతో చెల్లించేందుకు సిద్ధమైన మొత్తం అక్షరాలా రూ.1.60 కోట్లు. ఇదే కాకుండా కర్నూలులో అక్టోబరులో జరిగిన ప్రధాని పర్యటన సందర్భంగా కూడా రూ.41.52 లక్షల మేర చెల్లింపులు చేశారు. గుంటూరుకు చెందిన కేకేవీఎస్‌ గ్రీన్‌ వెంచర్స్‌ సంస్థకే ప్రధానంగా ఈ మొబైల్‌ టాయిలెట్ల సరఫరా పనులన్నీ దక్కుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఒకే సంస్థ పేరుతో కాకుండా ప్రెస్టేజ్‌ కన్‌స్ట్రక్షన్స్‌, వై.మోహన్‌, కోనసీమ సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీనర్స్‌ పేరుతో పనులు దక్కినప్పటికీ.. మొబైల్‌ టాయిలెట్లను సరఫరా చేస్తోంది మాత్రం కేకేవీఎస్‌ గ్రీన్‌ వెంచర్స్‌ సంస్థ అనే విమర్శలున్నాయి. ఈ సంస్థ యజమాని గుంటూరుకు చెందిన టీడీపీ నేత కావడమే ఈ అదనపు చెల్లింపులకు ప్రధాన కారణమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

రెండు కార్యక్రమాలు..

రూ.2 కోట్లు..!

యోగా డే పేరుతో జరిగిన యోగా విన్యాసాలకు మించి మొబైల్‌ టాయిలెట్ల ఏర్పాటులో చేసిన విన్యాసాలు రక్తి కట్టించినట్టు అర్థమవుతోంది. వీఐపీ టాయిలెట్ల పేరుతో రూ.16,200, బయో టాయిలెట్ల పేరుతో రూ.16 వేలు.. సాధారణ టాయిలెట్ల పేరుతో రూ.11,957 ఇలా యోగా డే సందర్భంగా అద్దె చెల్లించేందుకు జీవీఎంసీ ప్రజారోగ్యశాఖ అధికారులు సిద్ధమయ్యారు. అది కూడా ఎటువంటి టెండర్‌ లేకుండానే నామినేషన్‌పై పనులను అప్పగించడం గమనార్హం. కార్యక్రమం నిర్వహించిన 6 నెలల తర్వాత తీరిగ్గా అనుమతి కోసం స్టాండింగ్‌ కమిటీ ముందు ఉంచారు. ఈ విధంగా మొత్తం రూ.1.62 కోట్ల మేర కేవలం మొబైల్‌ టాయిలెట్ల అద్దె బిల్లు అవుతుండగా... కర్నూలులో అక్టోబరులో జరిగిన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన వాటిలోనూ ఇదే తంతు జరిగింది. అయితే, ఇక్కడ టెండర్లను పిలిచి... 880 టాయిలెట్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఒక దానికి రూ.4,500, మరో దానికి రూ.6,900 చొప్పున మొత్తం రూ.41.52 లక్షల మేర కేవలం అద్దె రూపంలో చెల్లించింది. అంటే కేవలం ఈ రెండు కార్యక్రమాలకే మొబైల్‌ టాయిలెట్లకే రూ.2 కోట్లకుపైగా వెచ్చించడం విస్తుగొలుపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement