చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఈ 18 నెలల కాలంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, భూకబ్జాలు, ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. మంగళవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా మహిళా విభాగం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరుదు కల్యాణి మాట్లాడుతూ.. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ మహిళా విభాగం కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మహిళలకు జరిగిన మేలును వివరిస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వ మోసాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు సర్కార్‌ను నిలదీస్తూ, ప్రజల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు. కూటమి నేతల అఘాయిత్యాలకు బలవుతున్న బాధితులకు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అండగా నిలిచి భరోసా కల్పించాలన్నారు. జోన్–1 మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, పేడాడ రమణికుమారి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు, స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతానికి పైగా అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు. మళ్లీ మహిళలకు ఆ ప్రాధాన్యత దక్కాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే దిశగా ప్రతి మహిళా కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. సమావేశంలో మహిళా కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, వార్డు స్థాయి మహిళా నేతలు, అనుబంధ విభాగాల సభ్యులు పాల్గొన్నారు.


