బౌల్ ఏరియాతో సంకట స్థితి
గాలి, నీరు, నేల కాలుష్య కోరల్లో చిక్కుకొని నగరానికి సవాల్ విసురుతున్నాయి. ఓవైపు సుందర తీరం.. మూడు వైపులా కొండలు.. మధ్యలో సుమారు 265 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న విశాఖకు వరంగా భావించేవారు. కానీ.. అదే ఇప్పుడు కొంప ముంచే కాలుష్యానికి కారణంగా మారుతోంది. ఈ విధంగా ఉండటాన్ని బౌల్ ఏరియాగా పిలుస్తుంటారు. ఈ బౌల్ ఏరియాలోకి కాలుష్యం విస్తరిస్తే బయటకు వెళ్లే మార్గముండదని పర్యావరణవేత్తల అభిప్రాయం. ఏడాదికి 9 నెలల పాటు నైరుతి దిశగా నగరం వైపు గాలులు వీస్తుంటాయి. ఈ దిక్కున భారీ పరిశ్రమలు ఉండడంతో ఏడాదికి 8 నెలలపాటు అంటే మార్చి నుంచి అక్టోబర్ వరకు అవి వెలువరించే వాయు, ధూళి కాలుష్యాలు గాలివాటంతో నగరాన్ని తాకుతున్నాయి. సుమారు 300 నుంచి 500 మీటర్ల ఎత్తుగా ఉండే ఈ కొండలు ఈ కాలుష్య వాయువులకు అడ్డుగా నిలబడి, వెనక్కు నెట్టి వేస్తున్నాయి. నగరంలోనే అవి తిష్ట వేసుకొనేటట్లు చేస్తున్నాయి. శీతాకాలంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తక్కువ ఉష్ణోగ్రతలు, మంచు కారణంగా కాలుష్యభరిత వాయువులు, హానికర ధూళి పదార్థాలు వాతావరణంలో పైకి పోలేక భూమి పైనే కేంద్రీకృతం అవుతున్నాయి. సాధారణంగా భూమి మీద వేడి గాలులు, ఆ పైన చల్ల గాలులు ఉంటాయి. ఇవి శీతాకాలంలో తారుమారు అవుతూ ఉంటాయి. దీంతో హానికర ధూళి పదార్థాలు ఉపరితల వాతావరణంలోకి వెళ్లడం లేదు.


