ఆందోళనకరంగా సూచీలు
గత నెల రోజులుగా విశాఖలో గాలి నాణ్యత సూచీలు(ఏక్యూఐ) ఆందోళనకరంగా ఉన్నాయి. చలికాలంలో కమ్ముకుంటున్న కాలుష్య మేఘాలు ఊపిరి సలపనివ్వకుండా చేస్తున్నాయి. గత వారం రోజులుగా ఢిల్లీలో మాదిరిగా ఏక్యూఐ 326 దాటుతోంది. పలు సందర్భాల్లో 329 కూడా నమోదై ఆందోళన కలిగించింది. ముఖ్యంగా రాత్రి సమయాల్లోనే కాలుష్య ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్ 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తిగా, 101 నుంచి 200 అయితే మోడరేట్‌గా, అంతకు మించి 201 నుంచి 300 అయితే పూర్, 301 నుంచి 400 వరకు అయితే వెరీ పూర్, 401 నుంచి 500 అయితే తీవ్ర ఆందోళనకర పరిస్థితిగా పేర్కొంటారు. విశాఖలో మాత్రం ప్రతి గంటకు గాలి నాణ్యత సూచీ పెరుగుతోంది. సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఏక్యూఐ 290 దాటి అర్ధరాత్రికి 329కి చేరుకుంటోంది. గాలి కాలుష్య రేణువులు క్యూబిక్ మీటరుకు 60 మైక్రో గ్రాములు మించితే ప్రమాదం. పార్టికులేట్ మేటర్(పీఎం) 10 రేణువులు ప్రమాదకర స్థాయిలో 436 చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కానీ పీఎం 2.5 రేణువులు రాత్రి వేళల్లో 386గా నమోదవుతోంది.


