
బస్సులపై భారం.. ప్రాణాలతో చెలగాటం
నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్సు దగ్ధం తప్పిన ఘోర ప్రమాదం.. ప్రయాణికులంతా సురక్షితం బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు
తాటిచెట్లపాలెం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సీ్త్ర శక్తి’ పథకం ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారింది. శుక్రవారం విశాఖలో జరిగిన బస్సు ప్రమాదం.. ఈ ఆందోళనను మరింత పెంచింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో సాధారణ ప్రయాణికులతో పాటు ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో బస్సుల సామర్థ్యానికి మించి ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి బస్సుల నిర్వహణపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. తగినన్ని బస్సులను నడపకుండా, ఉన్న బస్సులపైనే భారం మోపడం వల్ల, అవి త్వరగా పాడైపోతున్నాయి. సరైన నిర్వహణ లేకపోవడం, అధిక భారం వల్ల ఇంజిన్‌లు వేడెక్కడం వంటి సమస్యలు తలెత్తి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. విశాఖలో బస్సు దగ్ధమైన ఘటన ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు. కానీ ఈ సంఘటన ఉచిత బస్సు ప్రయాణంపై ప్రజలు, ముఖ్యంగా మహిళలు పునరాలోచించుకునేలా చేసింది.
క్షణాల్లో అగ్నికీలలు.. బస్సు దగ్ధం
ఫోర్త్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై విశాఖ–విజయనగరం మెట్రో బస్సులో శుక్రవారం పొగలు వచ్చాయి. ఆటో డ్రైవర్.. కండక్టర్‌కు సమాచారం ఇవ్వడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. దీంతో ప్రయాణికులందరూ తక్షణమే బస్సులో నుంచి దిగిపోయారు. కొన్ని క్షణాల్లోనే బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదాలకు కారణం.. అధికారుల నిర్లక్ష్యం?
సామర్థ్యానికి మించి ప్రయాణించడం, బస్సుపై అధిక ఒత్తిడి పడటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఉచిత బస్సు పథకం ప్రారంభించినప్పుటి నుంచి అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించకపోతే ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం జరిగినప్పుడు
అక్కడే ఉన్నా..
ఆ సమయంలో ఇక్కడే విధి నిర్వహణలో ఉన్నాను. అకస్మాత్తుగా బస్సులో నుండి పొగలు, మంటలు రావడంతో వెంటనే అఽగ్ని మాపక సిబ్బందికి, ఉన్నతాధికారులకు సమాచారం అందించాను. ప్రయాణికులందర్నీ దూరంగా వెళ్లిపోవాలని ఆదేశించాను. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు.
– బంగారుబాబు,
ఫోర్త్‌టౌన్ ట్రాఫిక్ కానిస్టేబుల్
దగ్ధమైన బస్సు