
రుషికొండ డ్రామా బట్టబయలు
వాస్తవాన్ని అధికారికంగా అంగీకరించిన బాబు ప్రభుత్వం
నిన్నటివరకూ జగన్ ప్యాలెస్ అంటూ దుష్ప్రచారం.. నేడు అది పర్యాటక రిసార్ట్ అంటూ జీవో
రిసార్ట్ వినియోగంపై మంత్రుల బృందం ఏర్పాటు
ఇది డైవర్ట్ చేయడానికి రుషికొండ భవనంలో బాబు డైరెక్షన్‌లో పవన్ యాక్షన్
ప్రీతి సుగాలి తల్లి నిలదీయడంతో పవన్ కొత్త డ్రామాలు
మేమే న్యాయం చేశామంటూ అడ్డగోలుగా బుకాయింపు
నిజానికి ప్రీతి సుగాలి కుటుంబానికి భూమి, ఉద్యోగం ఇచ్చింది జగన్ ప్రభుత్వమే
రుషికొండ భవన సముదాయాలు హడావుడిగా పరిశీలన
సీలింగ్ పడిపోయినట్లు మరో దుష్ప్రచారం
నిజానికి రంపంతో కోసినట్లు కనిపిస్తున్న ఫాల్స్ సీలింగ్
ఊడిన చోట కాకుండా దూరంగా పడేసి దొరికిపోయిన దొంగలు
ప్రతి విషయంపైనా ప్రజలను మభ్యపెట్టి, అబద్ధాలను నిజాలుగా భ్రమింపజేస్తూ దుష్ప్రచారం చేయడం చంద్రబాబు
నైజం అని మరోసారి నిరూపితమైంది...!
విశాఖపట్నం రుషికొండ భవనాల సాక్షిగా... ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందే కుట్రలో భాగంగా... చంద్రబాబుతో పాటు కూటమి పార్టీలు సాగించినదంతా తప్పుడు ప్రచారమేననితేలిపోయింది..!
రుషికొండలో నిర్మించినది మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్యాలెస్ కాదని, అది పర్యాటక శాఖ రిసార్ట్ అనే వాస్తవాన్ని చంద్రబాబు ప్రభుత్వం బహిరంగంగానే అంగీకరించింది...!
అవాస్తవాలను అడ్డగోలుగా ప్రచారం చేసి... వాటి పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి... దాదాపు ఏడాదిన్నర పాటు రుషికొండ భవనాలను విస్మరించింది...!
ఇప్పుడు అది వైఎస్ జగన్ ప్యాలెస్ కాదు.. పర్యాటక శాఖ రిసార్ట్ అంటూ నిజాన్ని ఒప్పుకొని నాలుక్కర్చుకుంది...!
...అయితే, ఇంతకాలం తాము సాగించిన తప్పుడు ప్రచారాన్ని కప్పిపుచ్చుకునేందుకు... రుషికొండ భవనాలను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ముందుపెట్టి పెద్ద డ్రామా ఆడింది..!
సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో... రుషికొండ భవనంలో పవన్ కళ్యాణ్ తన నట కౌశలాన్ని చూపించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన ఆయన.. రీల్ యాక్షన్, డ్రామా సన్నివేశాలను రియల్‌గానూ కొనసాగించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సినిమా సాగిందిలా..
సాక్షి, అమరావతి, విశాఖపట్నం: విశాఖపట్నంలో జనసేన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్... శుక్రవారం ఉదయం హఠాత్తుగా రుషికొండపై గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అత్యద్భుత పర్యాటక భవనాలను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ తన సినీ నటనా చతురతను ప్రదర్శించారు. అద్భుతంగా నిర్మించిన ఈ భవనంపై గతంలోనూ ఏడుపు ప్రదర్శించిన పవన్ మరోసారి అదే కంటగింపు కొనసాగించారు. రూ.లక్షల్లో కరెంట్ బిల్లు వస్తోందంటూ ఆరోపించారు. రూ.450 కోట్లతో నిర్మించిన భవనం పాడైపోతోందంటూ రాగాలు తీశారు.
అసలు వాస్తవం ఏమంటే, రుషికొండపై ప్రపంచం మెచ్చుకోదగ్గ ప్రభుత్వ భవనాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించింది. దీన్నిచూసి ఓర్వలేక ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి విష ప్రచారం చేశారు. పర్యాటకానికి ప్రపంచ చిరునామాగా మార్చాల్సిన ఈ భవనాన్ని ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. మరమ్మతుల పేరుతో భారీగా దోచుకునేందుకు పన్నాగం మొదలుపెట్టింది. ప్రైవేటుకు ఇస్తున్నట్లు నేరుగా చెబితే వ్యతిరేకత వస్తుందని గ్రహించిన చంద్రబాబు... పవన్ కళ్యాణ్‌ను పంపించి డ్రామా సృష్టించినట్లు తెలుస్తోంది.
నాసిరకం అని ముద్ర వేసే కుట్ర: రాజధాని పేరిట రూ.వేల కోట్లతో అమరావతిలో తాత్కాలిక భవనాలు నిర్మించిన చంద్రబాబు... కేవలం రూ.450 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనాలను చూసి అచ్చెరువొందారు. అద్భుతంగా నిర్మించారంటూ గతంలో చంద్రబాబుతో పాటు పవన్ కూడా కితాబిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భవనాలను పరిశీలించిన మంత్రులు, ఆ పారీ్టల నేతలంతా కూడా అద్భుతం అని కొనియాడారు. అమరావతి తాత్కాలిక భవనాలు, రుషికొండ నిర్మాణాల వ్యయాలను బేరీజు వేస్తూ నిపుణులు సైతం ప్రశంసించారు. మేధావులు చంద్రబాబు సాగించిన దుబారా వ్యయం పైనా చర్చ లేవనెత్తారు. దీంతో రుషికొండ భవనం అద్భుతం కాదని నిరూపించేందుకు కుట్ర ప్రారంభించారు.
ఏడాదిన్నర ఖాళీగా ఉంచి...
దాదాపు ఏడాదిన్నర కాలం పాటు ఖాళీగా ఉంచేశారు. ఇప్పుడు నాసిరకంగా నిర్మించారంటూ విమర్శలు మొదలుపెట్టేందుకు స్కెచ్ వేశారు. పవన్ కళ్యాణ్ వెళ్లి చూసినప్పుడు లోపల సీలింగ్ విరిగి పడినట్లుగా చూపించారు. ఆ వీడియోలను నిశితంగా పరిశీలిస్తే.. బరువైన సీలింగ్ నాసిరకంగా ఉండడం వల్ల పడిపోతే.. 90 డిగ్రీల కోణంలో సరిగ్గా కిందపడుతుంది.
కానీ, ఈ ముక్కలు కాస్త పక్కన పడ్డాయి. పైగా సీలింగ్‌ను చూస్తే రంపంతో కోసినట్లుగా కనిపిస్తోంది. అంటే, పవన్ వస్తున్నారని తెలిసి.. ప్రభుత్వం ఇదే అదనుగా సీలింగ్‌ను విరగ్గొట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడా ఎలాంటి లీకులు లేకుండా సీలింగ్ ఎలా పడిపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తే.. కావాలని రుషికొండ భవనానికి చెడ్డ పేరు తెచ్చేందుకు డ్రామాలు ఆడుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఇల్లు ఖాళీగా ఉన్నా కరెంటు బిల్లు రాదా?
రుషికొండ భవనాలకు భారీగా కరెంటు బిల్లు వస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నిర్మాణాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. అయితే, పటిష్ఠ నిర్మాణాన్ని ఏడాదిన్నరగా వినియోగించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనేది వాస్తవం కాదా? భవనం ఖాళీగా ఉన్నప్పటికీ కరెంటు బిల్లు రాకుండా ఉంటుందా? అంటూ అధికారులు గుసగుసలాడడం కనిపించింది. అయినప్పటికీ, ఇదికూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తప్పేనని చెప్పడం చూస్తే... అభాండాలు వేసేందుకు ఎంతగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
మరమ్మతుల పేరుతో కొట్టేసి.. ప్రైవేట్‌కు ఇచ్చేసి
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రుషికొండ భవన సముదాయాలను ఖాళీగా ఉంచారు. ఇప్పుడు ప్రైవేట్‌కు ఇచ్చేందుకు స్కెచ్ వేశారు. టూరిజం భవనాలు కాబట్టి.. టూరిజం పాలసీలో భాగంగా తక్కువ ధరకు లీజుకిచ్చి, దాని ద్వారా భారీగా నొక్కేసేందుకు యత్నాలు మొదలైనట్లు పర్యాటక వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు ప్రైవేట్ సంస్థలు రుషికొండ టూరిజం భవనాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. దీనిపై చంద్రబాబు ఆధ్వర్యంలో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. కానీ, ఈ భవనాలు ఎందుకు పనికొస్తాయి? అని స్వయంగా చంద్రబాబు గతంలో వ్యాఖ్యలు చేశారు.
నేడు ప్రైవేట్‌కు ఇవ్వాలని చూస్తున్నామని నేరుగా చెబితే తనపై వ్యతిరేకత వస్తుందని భావించి, పవన్‌ను పావుగా వాడుకున్నట్లుంది. విశాఖ పర్యటనలో ఉన్న పవన్‌తో చంద్రబాబు మాట్లాడి రుషికొండ భవనాలను పరిశీలించాలని ప్రైవేట్‌కు ఇవ్వాలా? ఎలా వాడాలి? అనేదానిపై మీడియాతో మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. బాబు పథకం ప్రకారమే... అక్కడ ఏర్పాట్లు చేసిన తర్వాత పవన్ ప్రవేశించి.. సినిమా షూటింగ్ తరహాలో యాక్షన్ డ్రామా మొదలుపెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, కర్నూలుకు చెందిన విద్యార్థిని సుగాలి ప్రీతి హత్య అంశాన్ని ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ లబి్ధకి ఉపయోగించుకున్నారు.
దీనిపై ప్రీతి తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ నమ్మకద్రోహం చేశారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే మొదట సుగాలి ప్రీతి కేసు ఫైల్ పైనే సంతకం చేస్తానని పవన్‌కళ్యాణ్ చెప్పిన వైనాన్ని ప్రస్తావిస్తూ సూటిగా ప్రశ్నిoచారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని పూర్తిగా డైవర్ట్ చేసేందుకు పవన్.. విశాఖలో రుషికొండ డ్రామాకు తెరతీశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మంత్రులూ.. ఏం చేద్దాం చెప్పండి..!
రుషికొండ భవనాలు పర్యాటక శాఖ రిసార్ట్ అంటూ వాస్తవాన్ని అంగీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భవనాలను సముచితంగా ఉపయోగించుకునేలా అధ్యయనానికి, సిఫార్సులు చేయడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయులతో బృందాన్ని ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ రిసార్ట్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో నిర్ణయం తీసుకోవడానికి మంత్రుల బృందం ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించాలని ఉత్తర్వుల్లో సూచించారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కిక్కురుమనకుండా..
» అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ మాట మారిందేల?
» ప్లాంట్ ప్రైవేటీ కరణపై జనసేనాని రెండు నాల్కల ధోరణి
విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని కీలక విభాగాలను ప్రైవేటుకు అప్పగిస్తూ ఇటీవల కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ గురించి పవన్ కిక్కురుమనలేదు. అసలు ఆ విషయం రాకుండా కవర్ చేయడానికి తాపత్రయపడ్డారు. స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనాలు చూసేందుకు వెళ్లారు. అందులో సీలింగ్ వేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొన్నిచోట్ల ఊడిందని చెబుతూ రాద్ధాంతం చేశారు. అటు రూ.వేల కోట్ల విలువైన ఉక్కు పరిశ్రమపై మాట్లాడకుండా డైవర్ట్ చేస్తూ ఇలా పూట గడిపేశారని విశాఖ యువత దుమ్మెత్తిపోస్తున్నారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో టీడీపీ, జనసేన ఎంపీల బలం ఉన్న ఈ సమయంలో పవన్‌కళ్యాణ్ కీలకమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై విశాఖ పర్యటనలో బేలగా మాట్లాడారు. ఇది కార్మికులతో పాటు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేంద్రం మెడలు వంచైనా ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కార్మికులు ప్రతిఘటిస్తుంటే.. ‘‘ఢిల్లీ అంటే ఏమనుకుంటారు?’’ అంటూ వారిని పరోక్షంగా తప్పుపట్టేలా వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం వేగంగా చేపడుతున్న ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పటిష్ట చర్యలేవీ చేపట్టకపోగా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ తప్పించుకునే ధోరణి కనబరిచారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులకు మద్దతుగా దీక్షకూ సిద్ధమని మాట్లాడిన జనసేన అధినేత, ఇప్పుడు కార్మికులను తప్పుపట్టేలా మాట్లాడుతున్నారు.
క్యాప్టివ్ మైన్స్ తేవడం చేతకాక వైఎస్సార్‌సీపీపై నిందలా?
» చంద్రబాబు, పవన్ చేతికానితనంతోనే ప్రైవేటీకరణ
» వైఎస్సార్‌సీపీ నేత జూపూడి ప్రభాకర్
వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదని.. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతకానితనం వల్లే కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను వేగంగా కొనసాగిస్తోందని వైఎస్సార్‌సీపీ నేత జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో ఉంటూ టీడీపీ, జనసేనలు స్టీల్ ప్లాంట్‌కు ఎందుకు క్యాప్టివ్ మైన్స్‌ను సాధించలేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ లాస్‌లో ఉన్నట్టు చూపించి అమ్మేసే పనిలో ఉంటే మౌనం దాల్చారని పేర్కొన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమని... తాము ఉద్యోగులు, కార్మికుల తరుఫున పోరాడతామని చెప్పారు.
ఈ ప్లాంట్‌కు జపాన్, కొరియా, అమెరికా, రష్యాల్లో మార్కెట్ ఉందని, క్యాప్టివ్ మైన్స్ ఇస్తే అద్భుతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. టీడీపీ, జనసేనలు చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపింది వైఎస్ జగన్. ఆపలేక చేతులెత్తేసింది మీరు. చిత్తశుద్ధి లేని కూటమి నాయకులు, ఎన్నికలకు ముందు ఒకలా, గెలిచాక మరోలా మాట్లాడుతున్నారు’ అంటూ జూపూడి మండిపడ్డారు.