
2 నుంచి సింహగిరిపై పవిత్రోత్సవాలు
సింహాచలం: సింహగిరిపై వచ్చే నెల 2 నుంచి 6 వరకు పవిత్రోత్సవాలను విశేషంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తెలిపారు. 2వ తేదీ సాయంత్రం 6 నుంచి రుత్విక్‌వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 3న ఉదయం 7 గంటల నుంచి శాంతిపాఠం, పవిత్రాధివాసం, యాగశాలార్చన, కుంభవాహనం, చక్రాబ్జమండలరచనం, పవిత్రప్రతిష్ట, సాయంత్రం 5 నుంచి గ్రామతిరువీధి ఉంటాయన్నారు.
4న ఉదయం విశేష ఆరాధన, హోమాలు, పారాయణాలు, సాయంత్రం తిరువీధి, రాత్రి పవిత్ర సమర్పణ నిర్వహించనున్నట్లు తెలిపారు. 5న ఉదయం పూర్ణాహుతి, పవిత్ర విసర్జనం, గ్రామతిరువీధి, 6న ఉదయం ఏకాంతస్నపనంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 2 నుంచి 6 వరకు నిత్యకల్యాణంతో పాటు అన్ని ఆర్జిత సేవలు బంద్ చేసినట్లు తెలిపారు.