
కబడ్డీ.. కబడ్డీ
విశాఖ స్పోర్ట్స్: కబడ్డీ.. కబడ్డీ అంటూ కొదమ సింహాల్లా బరిలో నిలిచే ప్లేయర్లు సిద్ధమయ్యారు. అదరగొట్టే యాక్షన్ మొదలుకాబోతోంది. కబడ్డీ ప్రేమికులను ఉత్కంఠతో నిలబెట్టే ప్రో కబడ్డీ సీజన్–12 విశాఖ వేదికగా శనివారం ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా గురువారం 12 జట్ల కెప్టెన్లు ట్రోఫీతో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. పోటీకి సై అంటూ తొడకొడుతూ సవాల్ విసిరారు. ప్రముఖ క్రియెటర్లతో కలిసి మ్యాట్ మావెరిక్స్, రైడ్ మాస్టర్లు పేరిట రెండు జట్లుగా విడిపోయి కబడ్డీ ఆడారు. విశాఖ వేదికగా శుక్రవారం రాత్రి 8 గంటలకు తెలుగు టైటాన్స్–తమిళ్ తలైవాస్ మధ్య మ్యాచ్‌తో లీగ్ ఆరంభంకానుంది. ఈసారి ప్రో కబడ్డీ ఫార్మాట్‌లో మార్పులు చేశారు. తొలిసారిగా జట్లు రెండు గ్రూపుల్లో ఆడనున్నాయి. తెలుగు టైటాన్స్ జట్టు ‘బి’ గ్రూప్‌లో ఉంది. ప్రతి జట్టు లీగ్ దశలో 18 మ్యాచ్‌లు ఆడుతుంది. ప్లే–ఆఫ్స్‌తో పాటు ‘ప్లే–ఇన్‌లు’ కూడా ప్రవేశపెట్టారు. తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే–ఇన్‌లు, ప్లే–ఆఫ్స్ ఆడతాయి. ఫలితం తేలని మ్యాచ్‌ల్లో విజేతను నిర్ణయించడానికి ‘గోల్డెన్ రైడ్’ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ కొత్త ఫార్మాట్ భవిష్యత్తులో మరిన్ని లీగ్‌లలో అనుసరించవచ్చని ప్రో కబడ్డీ ఛైర్మన్ అనుపమ్ గోస్వామి తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ సీజన్ ప్రారంభం కావడం విశేషం. గురువారం అంతర్జాతీయ క్రీడాకారుడు రాహుల్ చౌదరి వంటి వారిని సత్కరించారు. అలాగే సీజన్ ప్రారంభానికి ముందు కెప్టెన్లు ఐఎన్‌ఎస్ కురుసురను సందర్శించి సాయుధ దళాలకు నివాళులర్పించారు. ప్రో కబడ్డీ లీగ్–12ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు. ఈ సీజన్ టికెట్లను జొమాటో డిస్ట్రిక్ట్‌లో అందుబాటులో ఉంచారు.