
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం కోస్టల్ బ్యాటరీ, నోవాటెల్, రాడిసన్ బ్లూ రిసార్ట్‌లలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కలెక్టర్ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. నొవాటెల్‌లో జరిగే ఫుడ్ మానుఫ్యాక్చరింగ్ సమ్మిట్, రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో జరిగే గ్రిఫిన్ నెట్‌వర్కింగ్ మీటింగ్ ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. హెలిప్యాడ్, గ్రీన్ రూమ్, సీటింగ్ వంటి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు.విద్యుత్, వైద్య, పారిశుద్ధ్య పనులలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్ మీటింగు హాలులో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ జీఎం హనుమా నాయక్, ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాయింట్ డైరెక్టర్ అన్షుమలి బాజ్ పాయి, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్‌లతో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై సమీక్షించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, కష్ణకాంత్ పాటిల్, డీఎఫ్‌వో రేణుకయ్య, పాల్గొన్నారు.