
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
ఉక్కునగరం: డీఎస్సీ–2025 ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రారంభమైంది. డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో విశాఖ విమల విద్యాలయం పాఠశాలలో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన అభ్యర్థులు హాజరయ్యారు. పరిశీలన కోసం పాఠశాలలో 24 రూమ్‌లను ఒక్కో రూమ్‌కు 50 చొప్పున 815 అభ్యర్థులకు కేటాయించారు. ప్రతీ రూమ్‌లో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారి, ఎంఐఎస్ కోఆర్డినేటర్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్‌లతో కూడిన బృందం సర్టిఫికెట్లను పరిశీలించారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం వచ్చిన ఒక మహిళా అభ్యర్థి తమ తండ్రి కుల ధృవీకరణ పత్రం తేవడంతో భర్త కుల ధృవీకరణ పత్రం తేవాలని చెప్పి సమర్పించడానికి కొంత వ్యవధి ఇచ్చారు. సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం జరగనుంది.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో జిల్లా నేతలకు చోటు
విశాఖ సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో జిల్లాకు చెందిన పలువురు నేతలకు చోటు దక్కింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలను చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. గాజువాకకు చెందిన చెరుకూరి హరీష్‌వర్మను రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగాను, విశాఖ ఉత్తర నుంచి బయ్యవరపు రాధాను రాష్ట్ర సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షురాలుగా, విశాఖ దక్షిణ నుంచి కణితుముచ్చు సాగర్‌ను రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా నియమించారు.
స్టీల్‌ప్లాంట్ ఫైనాన్స్ డైరెక్టర్‌గా వినయ్‌కుమార్
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ నూతన డైరెక్టర్ (ఫైనాన్స్)గా సెయిల్ కార్పొరేట్ ఆఫీస్ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ వినయ్ కుమార్ ఎంపికయ్యారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో బుధవారం సెర్చ్ కమ్ సెలక్షన్ కమీటీ (ఎస్‌సీఎస్‌సీ) నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో 13 మంది అభ్యర్ధులను పరిశీలించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి నలుగురు. సెయిల్ నుంచి ఏడుగురు, ఎన్‌ఎండీసి, ఎన్‌సీఎల్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున వచ్చిన దరఖాస్తులో వినయ్ కుమార్‌ను ఎంపిక చేసినట్టు ప్రకటించారు.