
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని శాంతిపురం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. అయితే, ఎలక్ట్రిక్ బస్సుల్లో విద్యుదాఘాతం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
వివరాల ప్రకారం.. కుర్మన్నపలెం నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి పురం జంక్షన్ వద్ద బస్సు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో, బస్సులో ఉన్న ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై బస్సు పూర్తిగా దగ్దమైంది. అయితే, బస్సులో ఓవర్‌లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పలువురు చెబుతున్నారు. బస్సు కెపాసిటీ 65 మంది కాగా 100కు పైగా మంది ప్రయాణించినట్టు తెలిసింది. వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు సమాచారం.
