
అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో తుపానులు
ఏపీ, తమిళనాడులో తీరం దాటే అవకాశాలు
ఈనెల 15 నాటికి నిష్క్రమించనున్న నైరుతి
సాక్షి, విశాఖపట్నం: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల నిష్క్రమణ చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే ఉత్తర, మధ్య భారతాన్ని వీడిన నైరుతి.. ఈ నెల 14 నాటికి రాష్ట్రం నుంచి, 15 నాటికి దేశవ్యాప్తంగా నిష్క్రమించనుంది. ఇదే సమయంలో ఈ నెల మూడో వారంలో ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి మార్గం సుగమమైంది. 17 నుంచి 20వ తేదీ మధ్యలో ఈశాన్య రుతుపవనాల రాక మొదలయ్యే వాతావరణం కనిపిస్తోంది. ఇవి తమిళనాడు, పాండిచ్చేరి, ఏపీ, కర్ణాటక, కేరళలో ప్రభావం చూపించే అవకాశం ఉందని భారత వాతావరణ నమూనాలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే ప్రపంచ వాతావరణ విశ్లేషణలు మాత్రం.. పసిఫిక్ మహాసముద్ర పరిస్థితుల కారణంగా ఈశాన్య రుతుపవనాలకు ప్రతికూలతలు కనిపిస్తున్నాయని, దీంతో కాస్త ఆలస్యమయ్యే సూచనలున్నాయని అంచనా వేస్తున్నాయి. 1998, 2005, 2021లో ఈశాన్య రుతుపవనాలు సాధారణం కంటే అధిక వర్షపాతాన్ని అందించాయని, ఈసారి కూడా అదే తరహాలో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తమిళనాడు, ఏపీ, కర్ణాటక, కేరళ, తెలంగాణలో అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి.
ఈశాన్య రుతుపవనాల రాకతో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయి. 2 లేదా 3 తుపాన్లు కూడా రానున్నాయని, ఇవి తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ వద్ద తీరందాటే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు నైరుతి నిష్క్రమణ కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
నేడు పలుచోట్ల మోస్తరు వర్షాలు
సాక్షి, అమరావతి: ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ కోస్తా వరకూ విస్తరించి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం చిత్తూరు పట్టణంలోని దొడ్డిపల్లిలో 3.4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపురంలో 3.1, శ్రీకాకుళం జిల్లా కొర్లాంలో 2.6 సెం.మీ. వర్షం కురిసింది. ఆదివారం అల్లూరి, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.