హెపటైటిస్–ఏ బాధిత కురుపాం ఆశ్రమ పాఠశాల విద్యార్థుల్లో ప్రమాదకర సంకేతాలు
ఆశ్రమ పాఠశాల పక్కనే ఉన్న ఏకలవ్య స్కూల్ విద్యార్థులకూ వ్యాపించిన హెపటైటిస్–ఏ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: హెపటైటిస్–ఏ బారినపడిన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల్లో కొందరి పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోందా?... ఈ వ్యాధి సోకినవారు వెంటనే కోలుకునే స్థితిలో లేరా?.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గిరిజన బిడ్డలు ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారా?.. అంటే వైద్య నిపుణుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకవైపు ఇప్పటికే కురుపాం ఆశ్రమ పాఠశాలలో వందల మంది విద్యార్థులను వణికిస్తున్న హెపటైటిస్–ఏ... పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలకూ పాకింది. ఇక్కడ కూడా వందల మంది విద్యార్థులు హెపటైటిస్–ఏతో ఇబ్బంది పడుతున్నట్టు పరీక్షల ద్వారా తెలుస్తోంది. అయితే, సాధారణ హెపటైటిస్–ఏ వేరియంట్ కంటే పిల్లలకు సోకిన వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు గుర్తించారు.
గోప్యంగా ఉంచిన ప్రభుత్వం!
ఈ వ్యాధి బారినపడిన వారు వెంటనే కోలుకుంటున్న పరిస్థితి కూడా లేదని వైద్యులు గుర్తించినట్టు సమాచారం. అందువల్ల మూకుమ్మడిగా వైద్య పరీక్షలు చేయడంతోపాటు హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఒక విద్యార్థికి అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ స్టేజీ–1గా కూడా వైద్యులు గుర్తించారు. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల పరిస్థితి విషమిస్తే కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్)కి కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వైద్య నిపుణులు సూచిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అవసరమైన వైద్య సదుపాయాలు లేవు. వెంటనే కాలేయ మార్పిడికి అవసరమైన ప్రొటోకాల్స్‌ను సిద్ధం చేసుకుని, తగిన వైద్య సదుపాయాలు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంటే మంచిదని ప్రభుత్వానికి వైద్య నిపుణులు సూచించినట్టు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడమే కాకుండా వివరాలన్నీ గోప్యంగా ఉంచుతూ గిరిజన విద్యార్థులు, ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నెల కిందటే గుర్తించినా...!
పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం ఆశ్రమ పాఠశాలలో నెల కిందటే ఒక విద్యార్థికి హెపటైటిస్–ఏ సోకిందని వైద్యులు గుర్తించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా వైద్యాధికారులతోపాటు జిల్లా యంత్రాంగం మొత్తానికి సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలిసినప్పటికీ వైద్య బృందం వెంటనే విద్యార్థులు అందరికీ పరీక్షలు కూడా చేయకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆదేశాలు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మరొకరు కూడా మృతి చెందినప్పటికీ... హెపటైటిస్–ఏ కారణం కాదని చెబుతున్నారు. మరోవైపు తాజా పరీక్షల్లో ఈ కొత్త వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని తేలినందున హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి కురుపాం ఆశ్రమ పాఠశాలతోపాటు పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలలోని విద్యార్థులకు, వారిని కలిసినవారికి, ఆయా గ్రామాల్లో వెంటనే మూకుమ్మడిగా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది.