
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘మీ జాతకాలు అన్నీ నా వద్ద ఉన్నాయి. ఎవరెవరు ఏమి చేస్తున్నారో నాకు తెలుసు. పదవి అనేది మనకు సేవ చేసేందుకు లభించిన అవకాశం. కానీ కొంత మంది తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలున్నాయి. కనీసం మనల్ని నిలబెట్టిన కేడర్‌ను కూడా పట్టించుకోకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఇది సరికాదు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ కూడా ప్రకటిస్తా మీ పద్ధతి మార్చుకోండి. లేదంటే నా తరహాలో నేను సరిదిద్దాల్సి వస్తుంది’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మూడు రోజుల పాటు విశాఖలో తలపెట్టిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తానని తెలపడంతో పాటు ప్రతీ ఒక్కరి పనితీరును అంచనా వేసేందుకు ప్రత్యేక మెకానిజం కూడా ఉందని పేర్కొన్నారు.
ప్రధానంగా మనకు అవకాశం కల్పించిన ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యులపై ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయని.. వీటిని వెంటనే సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని హితవు పలికినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మీ తీరు మారకపోతే నేను నా పద్ధతిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించినట్టు సమాచారం. మొత్తంగా చంద్రబాబు తరహాలో ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తున్నామని తెలపడంతో పాటు ర్యాంకులు కూడా ఇస్తామని చెప్పడం గమనార్హం. విశాఖలో మూడు రోజులపాటు జరుగుతున్న సమావేశాల్లో మొదటిరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ కార్యవర్గంతోనూ సమావేశమయ్యారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
ఉమ్మడి విశాఖ ఎమ్మెల్యేలే టాప్..!
ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనకు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ముగ్గురిపై భారీ స్థాయిలో ఆరోపణలు గుప్పుమంటున్నాయనే చర్చ జరిగినట్టు సమాచారం. మైనింగ్ నుంచి పోస్టింగుల వరకూ.. ప్రతీ పనికి ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా భూకబ్జా ఆరోపణలు కూడా వస్తున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఏకంగా ఒక ఎమ్మెల్యేపై నేరుగా కొంత మంది చంద్రబాబుకే ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు కేబినెట్ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలతో మాట్లాడి సరిదిద్దుకోవాలని సూచించినట్టు కూడా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ పూర్తిస్థాయిలో అసంతృప్తిని వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యే మండలానికి ఒకరిని నియమించి వసూళ్లు చేపడుతుండగా.. మరో ఎమ్మెల్యే సోదరుడు మొత్తం పెత్తనమంతా చేస్తున్నారని కూడా పవన్ దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఇక మరో ఎమ్మెల్యే అందినకాడికి దండుకుంటున్నారని కూడా పక్కా సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యేపై నేరుగా ఫిర్యాదులు లేకపోయినప్పటికీ.. ఆయన అల్లుడిపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని కూడా పవన్ పేర్కొన్నట్టు చర్చ జరుగుతోంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలోని మొత్తం నలుగురి ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ అసంతృప్తిని వెలిబుచ్చినట్టు ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.
చంద్రబాబు ఆదేశాలతోనే...!
వాస్తవానికి గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూటమిలోని ఎమ్మెల్యేలపై విమర్శలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలను పిలిచి మందలించి పంపుతున్నానని.. బీజేపీ, జనసేన అధ్యక్షులు కూడా వారి ఎమ్మెల్యేలను పిలిచి తప్పులుంటే సరిచేసుకోవాలని చెప్పాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే జనసేన ఎమ్మెల్యేలకు పవన్ క్లాస్ పీకారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అంతేకాకుండా తమ ఎమ్మెల్యేలకు పనితీరు ఆధారంగా చంద్రబాబు తరహాలో రేటింగ్ కూడా ఇస్తానని చెప్పడం పట్ల జనసేన నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రతీ పార్టీ పనితీరుకు ప్రత్యేకమైన విధానం ఉంటుంది. మరో పార్టీ స్టైల్‌ను ఫాలో కావడం మంచిది కాదు. చంద్రబాబు కేబినెట్ సమావేశంలో ఆదేశించారంటూ.. సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఈ తరహాలో క్లాస్ పీకడం సరికాదు’ అని సమావేశంలో పాల్గొన్న ఓ నేత అభిప్రాయపడ్డారు. అయితే, పార్టీ అధినేత నిరంతరం ఈ విధంగా సమావేశం కావడం మంచిదేనని.. కార్యకర్తలు చెప్పే సమస్యలు వింటే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.