
వారు మరణించి.. కొందరికి వెలుగునిచ్చి
పెందుర్తి: పుట్టెడు దుఃఖంలోనూ పలు కుటుంబాలు మానవత్వం చాటుకున్నాయి. పెందుర్తిలోని సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ చొరవతో కొందరి జీవితాలకు వెలుగురానుంది. పెందుర్తి, చినముషిడివాడ, చింతలగ్రహారం ప్రాంతాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన వారి నేత్రాలను ఆయా కుటుంబాలు దానం చేశాయి. వివరాలివి..
చినముషిడివాడలో..
స్థానిక శతాబ్దినగర్‌లో నివాసం ఉంటున్న అడబాల అప్పలనర్సమ్మ(65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మరణించింది. విషయం తెలుసుకున్న ట్రస్ట్ అధ్యక్షుడు దాడి శ్రీనివాస్ అక్కడకు చేరుకుని స్థానికులు మెంటి మహేష్, చిట్టిబోయిన గౌరి చొరవతో నేత్ర దానం కోసం కుటుంబ సభ్యులను ఒప్పించారు. దీంతో అప్పలనర్సమ్మ కుమారులు అడబాల ఎర్రినాయుడు, సత్యనారాయణ అంగీకారం తెలిపారు.
చింతలగ్రహారంలో..
గ్రామంలో నివాసం ఉంటున్న ఆడారి అప్పారావు(50) ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీనివాస్ మృతుని బంధువు భీశెట్టి శంకర్ చొరవతో కుటుంబ సభ్యులను నేత్రదానానికి ప్రతిపాదించగా.. అప్పారావు భార్య ఆడారి సూర్యకాంతం, కుమారులు శంకర్, రాము, కుమార్తెలు నాగమణి, వెన్నెల జ్యోతి ఆమోదించారు.
ప్రశాంతినగర్‌లో..
కాలనీలో నివాసం ఉంటున్న కందాల అరుణకుమారి(56) అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న సాయి ట్రస్ట్ ప్రతినిధులు నేత్రాదానానికి ఒప్పించగా.. భర్త బుచ్చి రమణ, కుమారుడు సాయిభరత్‌కుమార్ అంగీకారం తెలిపారు. ఆయా మృతుల నేత్రా(కార్నియా)లను మొహిషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధి మనోజ్ సేకరించారు. ఆయా కుటుంబాల మానవత్వానికి స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తాయి.
అప్పలనర్సమ్మ, అప్పారావు, అరుణకుమారి (ఫైల్)

వారు మరణించి.. కొందరికి వెలుగునిచ్చి

వారు మరణించి.. కొందరికి వెలుగునిచ్చి