
ప్రవర్తన బాగోలేకపోతే ఆ సౌకర్యాలు కట్
ఖైదీలకు ములాఖత్, క్యాంటీన్ సేవలు ఉండవు
ఆరిలోవ: జైలులో ఖైదీలు అన్నీ కోల్పోతారనేది ఒక అపోహ. వాస్తవానికి వారు నాలుగు గోడల మధ్య కొన్ని సౌకర్యాలను అనుభవిస్తారు. అయితే ఈ సౌకర్యాలు ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉన్నంత వరకే వర్తిస్తాయి. లేకపోతే వారికి కల్పించే ముఖ్యమైన రెండు అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. సాధారణంగా ఖైదీలకు మూడు పూటలా ఆహారంతో పాటు జైలు లోపల క్యాంటీన్ ఉంటుంది. ఈ క్యాంటీన్‌లో బేకరీ ఉత్పత్తులు, సబ్బులు వంటి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. శిక్ష పడిన ఖైదీలు నెలకు రూ. 1,500 వరకు, రిమాండ్‌లో ఉన్న ఖైదీలు నెలకు రూ. 3,000 వరకు ఖర్చు చేయవచ్చు.
ఇవే కాకుండా ఖైదీలకు ములాఖత్ (కుటుంబ సభ్యులను కలవడం) సదుపాయం ఉంటుంది. రిమాండ్ ఖైదీలకు వారానికి రెండు ములాఖత్‌లు ఉంటాయి. ఒక్కో ములాఖత్‌లో ముగ్గురు పెద్దలు, పదేళ్ల లోపు పిల్లలు ఉండవచ్చు. శిక్ష పడిన ఖైదీలకు మాత్రం రెండు వారాలకు రెండు ములాఖత్‌లు ఉంటాయి. ఖైదీల ప్రవర్తన సరిగా లేకపోతే, వారికి కల్పిస్తున్న ఈ ముఖ్యమైన సౌకర్యాలను రద్దు చేస్తామని జైలు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఖైదీ ప్రవర్తనలోని తీవ్రతను బట్టి ఈ రెండింటిలో ఒకటి లేదా రెండూ కోల్పోవచ్చని చెబుతున్నారు. మూడు రోజుల క్రితం నెల్లూరు నుంచి విశాఖకు తరలించిన శ్రీకాంత్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. నెల్లూరు జైలులో అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు అతను తన ప్రియురాలితో అనుచితంగా ప్రవర్తించాడని, దీనికి శిక్షగా అతని ములాఖత్, క్యాంటీన్ సౌకర్యాలను రద్దు చేయాలని నెల్లూరు జైలు అధికారులు ఆలోచనలో ఉన్నట్టు విశాఖ జైలు అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే శ్రీకాంత్‌ను ఎవరూ కలవడానికి వీలుండదు.