
క్లాప్ డ్రైవర్‌పై జెడ్సీ దాడి
సస్పెండ్ చేయాలంటూ కార్మికుల ఆందోళన
భీమునిపట్నం: చెత్త తరలించే క్లాప్ వాహన డ్రైవర్ ఇంటి శ్రీనుపై జోనల్ కమిషనర్ అయ్యప్పనాయుడు చేయి చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. శ్రీను విధులను సరిగా నిర్వర్తించడం లేదని ఆరోపిస్తూ ఆయనపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన పారిశుధ్య కార్మికులు జోనల్ కార్యాలయం వద్ద సోమవారం నిరసనకు దిగారు. వారికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.ఎస్.ఎన్. మూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ ఒక బాధ్యతగల అధికారి ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. డ్రైవర్ దళితుడు కావడం వల్లే ఇలా చేశారని, ఇది దారుణమని ఆయన ఆరోపించారు. సరిగా పని చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలే తప్ప, ఇలా దాడి చేయడమేంటని ప్రశ్నించారు. జోనల్ కమిషనర్‌ను సస్పెండ్ చేసి, కేసు నమోదు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై జెడ్సీ అయ్యప్పనాయుడు వివరణ కోరగా.. ‘కోపంతో అలా చేశాను. దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకు?’ అని బదులిచ్చారు. అంతేకాకుండా.. ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తే సమస్యలు ఉండవని అన్నారు.