
‘కూటమికి ఓటేసినందుకు ప్రజలు పశ్చాత్తాపం’
సీతంపేట: కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్‌వెస్లీ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు కూటమి నాయకుల మాటలు నమ్మి ఓట్లు వేసినందుకు ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన వివరించారు. యూరియా కోసం రైతులు కిలోమీటర్ల మేర క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నానో యూరియాను వాడాలని రైతులపై ఒత్తిడి తీసుకురావడం బాధాకరమన్నారు. నానో యూరియా వల్ల పంట దిగుబడిలో ప్రోటీన్స్, నత్రజని శాతం తగ్గి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది యూరియా సరఫరా తగ్గిందని, ప్రైవేటు డీలర్లు యూరియాను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జాన్‌వెస్లీ మండిపడ్డారు. రైతాంగాన్ని దుర్భర పరిస్థితుల్లోకి నెట్టిన కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.