
సమస్యల సాధన కోసం పోరుబాట
మహారాణిపేట: వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో సోమవారం కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. వివిధ సంఘాల నేతలు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. తమ పెన్షన్లు తొలగించడంతో దివ్యాంగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరికి మద్దతుగా వైఎస్సార్‌సీపీ నాయకులు, ఇతర దివ్యాంగుల సంఘాల నేతలు కూడా వచ్చారు. దివ్యాంగులు వీల్ చైర్లు, ద్విచక్ర వాహనాలపై వచ్చి నిరసనలో పాల్గొన్నారు.
పెన్షనర్ల డిమాండ్లు
పెన్షనర్లకు చెల్లించాల్సిన రూ. 20,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు కె. ధీనబంధు మాట్లాడుతూ, నాలుగు పెండింగ్ డీఏలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ కమిషనర్‌ను నియమించి, మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి ఎస్.కె. హుస్సేన్ మాట్లాడుతూ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీం కింద అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందించాలని, పెండింగ్‌లో ఉన్న హెల్త్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.
నాయీ బ్రాహ్మణుల నిరసన
సెలూన్ షాపులు నడుపుతున్న నాయీ బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోను అమలు చేయాలని నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. వారంతా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. బీజేపీ వైద్య విభాగం కన్వీనర్ కాపవరపు వీర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ జీవోను అమలు చేసి నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయి బ్రాహ్మణ నాయకులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద పెన్షనర్లు, నాయి బ్రాహ్మణుల నిరసన

సమస్యల సాధన కోసం పోరుబాట