
మా పింఛన్‌మాకివ్వండి..
కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న దివ్యాంగులు
కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల ఆందోళన
మహారాణిపేట: దివ్యాంగులు కదం తొక్కారు. సదరం సర్టిఫికేట్ల రీ వెరిఫికేషన్ పేరుతో ఎప్పటి నుంచో వస్తున్న పింఛన్‌ను అర్ధాంతరంగా తొలగించి పొట్ట కొట్టొద్దంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి, ఇతర జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో దివ్యాంగులు నిరసన చేపట్టారు. లక్షల పింఛన్లు ఇస్తున్నామని గొప్పలకు పోతున్న కూటమి సర్కార్ అర్హులైన దివ్యాంగుల పింఛన్లు రద్దు చేస్తోందని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా.. పారదర్శకంగా పింఛన్లు అందజేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న పింఛన్లను ఒక్క సారిగా తొలగించడం అన్యాయమన్నారు. ఆందోళనలో దివ్యాంగుల ఆందోళనకు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకుడు తొత్తరమూడి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తుల డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ సంఘీభావం
కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ మద్దతు ప్రకటించింది. శాశ్వత ధృవీకరణ పత్రాలు ఉన్నా కూటమి ప్రభుత్వం రీ వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దారుణమని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి ఎల్లాజీ అన్నారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల మీద కక్షతో పెన్షన్లు తీసివేయడం అన్యాయమన్నారు. పింఛన్ తొలగిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. తొలగించిన దివ్యాంగుల పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని, దివ్యాంగుల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు 12 డిమాండ్స్‌తో కూడిన వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల నియోజకవర్గ అధ్యక్షులు చిప్పుళ్ల వెంకట అప్పారావు, నీలిపు ఈశ్వరరావు, గరికిన చంద్ర శేఖర్, ఉద్యోగులు, ెపెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు డి.మార్కెండేయులు తదితరులు పాల్గొన్నారు.