
అప్పుడు వ్యతిరేకించి..ఇప్పుడు వత్తాసు పలుకుతారా?
సీతంపేట: గతంలో నాలుగు సార్లు కార్పొరేటర్ల స్టడీ టూర్ కాంట్రాక్టు రమణకు అప్పగించినప్పుడు వ్యతిరేకించిన ప్రస్తుత మేయర్ పీలా శ్రీనివాసరావు, ఇప్పుడు అదే కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించడంలో దాగి ఉన్న మర్మమేమిటో చెప్పాలని 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాధిక్ ప్రశ్నించారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయంపై మాట్లాడారు. ప్రతి ఏటా మాదిరిగానే జీవీఎంసీ కార్పొరేటర్ల స్టడీ టూర్‌కు సిద్ధం అవుతున్నారని, అయితే గతంలో సదరన్ ట్రావెల్స్ మేనేజర్‌గా పనిచేసిన రమణకు మళ్లీ టూర్ బాధ్యతలు అప్పగించడం కార్పొరేటర్ల భద్రతను గాలికి వదిలివేయడమేనని సాధిక్ ఆరోపించారు. గతంలో నాలుగుసార్లు నిర్వహించిన టూర్లలో తాము చాలా ఇబ్బందులు పడ్డామని, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో బస్సుకు ప్రమాదం జరిగి 13 గంటలపాటు నరకయాతన అనుభవించామని గుర్తు చేశారు. మరోసారి బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో కార్పొరేటర్లందరూ భయభ్రాంతులకు గురయ్యారని తెలిపారు. ఆ సందర్భంలో ప్రస్తుత మేయర్ పీలా శ్రీనివాసరావు కాంట్రాక్టర్ రమణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, అతన్ని మార్చాలంటూ కౌన్సిల్‌లో ప్లకార్డులు పట్టుకున్నారని గుర్తు చేశారు. అప్పట్లో అవినీతి జరిగిందని ఆరోపించిన పీలా శ్రీనివాసరావు ఇప్పుడు మేయర్ అయ్యాక అదే వ్యక్తికి కాంట్రాక్టు ఇవ్వడం విడ్డూరంగా, దారుణంగా ఉందని మండిపడ్డారు. కార్పొరేటర్ల భద్రతపై మేయర్‌కు, కమిషనర్ కేతన్ గార్గ్‌కు లెక్కలేదా అని సాధిక్ ప్రశ్నించారు. శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో భోజనాలు నాసిరకంగా ఉన్నాయని, వాటిని తిని తాను అనారోగ్యానికి గురయ్యానని తెలిపారు. కార్పొరేటర్ల భద్రతపై జీవీఎంసీ కమిషనర్ దృష్టి సారించాలని, స్టడీ టూర్ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తానని ఆయన వెల్లడించారు.