సంక్షేమ పథకాలు బినామీల పరం
● ఆరోపించిన దళిత సంఘాల నాయకులు ● బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు కరువు
ఎంవీపీకాలనీ: జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, రుణాల మంజూరులో బినామీల పాత్ర పెరిగిపోయిందని దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎంవీపీ కాలనీలోని సంక్షేమ భవన్ సెమినార్ హాలులో మంగళవారం రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్‌కుమార్ అధ్యక్షతన ఎస్సీ సంఘాల నాయకులు, వీధి వ్యాపారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు పలు సమస్యలను లేవనెత్తారు. స్కూల్ బస్సులు, ట్రాక్టర్ల వంటి పెద్ద మొత్తంలో రుణాలు బినామీల పేరుతో మంజూరవుతున్నాయని ఆరోపించారు. స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియకముందే వెబ్‌సైట్లు మొరాయిస్తున్నాయని, దీంతో అర్హులైన వారు నష్టపోతున్నారని తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కార్పొరేషన్ ద్వారా ఎస్సీ యువతకు పారిశ్రామిక ప్రోత్సాహం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌కు చెందిన విలువైన భూములను పరిరక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారని, భూమి కొనుగోలు పథకం పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. విశాఖపట్నం జిల్లా పూర్తిగా నగరాన్ని ఆనుకుని ఉన్నందున.. రుణాల మంజూరు ప్రక్రియలో అందుకు అనుగుణంగా మార్పులు చేయాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్‌లో ప్రక్షాళన అవసరమని, పారదర్శకత పెంచాలని కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ దళిత సంఘాల నాయకులు లేవనెత్తిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాల భౌగోళిక పరిస్థితులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యపద్మ, మాల కార్పొరేషన్ డైరెక్టర్లు కొండ్రు మరిడయ్య, సబ్బవరపు గణేష్, పౌర సరఫరాలశాఖ డైరెక్టర్ బోడపాటి శివదత్త, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు బినామీల పరం


