పొగ.. జీవితాలకు సెగ
● దృఢ సంకల్పంతో వ్యసనానికి దూరం కావొచ్చు ● నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
డాబాగార్డెన్స్: సిగరెట్.. గుట్కా.. పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం ఎన్నో అనార్థాలకు, అనారోగ్యాలకు కారణం. ఈ చేదు నిజాన్ని గ్రహించే లోపే.. సిగరెట్ పొగలా మన ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. దృఢ సంకల్పంతో ఈ వ్యసనాన్ని దూరం చేసుకోవచ్చు. మన ఆరోగ్యంతో పాటు మన చుట్టూ ఉన్న వారి శ్రేయస్సు కోసం ఈ మహమ్మారిపై పోరాడాల్సిన అవసరం ఉంది. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.
పొగాకును ఏ రూపంలో తీసుకున్నా అది ప్రమాదకరమే. దీని వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఒక సిగరెట్‌లో 400 పైగా హానికరమైన రసాయనాలు ఉంటాయి. వీటి లో 48కి పైగా క్యాన్సర్ కారకాలున్నాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రసాయనాలు ఊపిరితిత్తులు, గొంతు, నాలుక వంటి భాగాలకు అతి సులువుగా క్యాన్సర్‌ను కలిగిస్తాయి. గర్భిణులు ధూమపానం చేస్తే, కడుపులోని శిశువు సున్నితమైన అవయవాలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. ధూమపానం చేసే వారు తమ చుట్టూ ఉన్నవారి ఊపిరితిత్తుల్లోకి దాదాపు 25 శాతం విష వాయువులను ఉచితంగా పంపి.. వారి అనారోగ్యానికి కారణమవుతున్నారు. ఆర్థికంగా చితికిపోయి, అనారోగ్యంతో మంచానపడి జీవితం దుర్భరంగా మారుతుంది.
చేయి చేయి కలుపుదాం
పొగతాగడం వల్ల కొత్త జబ్బులు వస్తున్నాయి. శారీరక రోగాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యల వలనే చాలా మంది పొగాకుకు బానిసలవుతున్నారు. ఈ అలవాటు మానేందుకు చాలా మంది ఇష్టపడడం లేదు. మందులు వాడినా మెడిటేషన్ చాలా ముఖ్యం. పొగాకు మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా.. మన చుట్టూ ఉన్న వారికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
– డాక్టర్ సునీల్‌కుమార్, చెస్ట్ ఫిజీషియన్, ప్రభుత్వ చాతి ఆసుపత్రి
పొగ.. జీవితాలకు సెగ


