కుట్టు మిషన్ల పథకంలో రూ.157 కోట్ల స్కాం?
మహారాణిపేట: కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పి దాదాపు రూ.157 కోట్లను కొట్టేసేందుకు కూటమి ప్రభుత్వం స్కెచ్ వేసిందని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ ఆరోపించారు. మద్దిలపాలెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మధ్యతరగతి బీసీ మహిళలకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి, కాపు మహిళలకు కుట్టు శిక్షణ పథకంలో మిషన్లు అందించేందుకు తొలుత రూ.100 కోట్లతో ప్రతిపాదించారన్నారు. ఆ తర్వాత ఈ పథకాన్ని రూ.257 కోట్లకు పెంచి భారీ అవినీతికి పాల్పడుతున్నట్లు భరత్ ఆరోపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో మూడు నుంచి ఐదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, అందులో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఆ మాట చెప్పి 50 రోజులు దాటినా 50 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ శిక్షణ మొదలు కాలేదన్నారు. కుట్టు మిషన్ల పేరు చెప్పి రూ.కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని భరత్ అన్నారు. ఈ పథకానికి సంబంధించి టెండర్‌లో పాల్గొన్న ఎల్1కు కేవలం 5 శాతం పని మాత్రమే అప్పగించి.. ఎల్ 2, ఎల్ 3కి సుమారు 95 శాతాన్ని పని అప్పగించడంతో వీరి అవినీతి ఏ రకంగా ఉందో తెలుస్తోందన్నారు. గుజరాత్‌లో తక్కువ నాణ్యత కలిగిన మిషన్లను రూ.4,300కు కొనుగోలు చేశారని, ఒకరి శిక్షణ కోసం అవుట్ సోర్సింగ్ సంస్థకు రూ.3,000 కేటాయించారన్నారు. ఒక లక్ష మందికి రూ.7,300 చొప్పున రూ.73 కోట్లు ఖర్చు అవుతుండగా.. టెండర్ విలువ మాత్రం రూ.257 కోట్లకు చూపించి భారీ కుంభకోణానికి స్కెచ్ వేశారని భరత్ విమర్శించారు. బీసీ మహిళల పేరుతో జరుగుతున్న ఈ స్కాంను ప్రజలకు వివరించి, ప్రజాధనం వృథా కాకుండా అడ్డుకుంటామని భరత్ స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వంపై
వైఎస్సార్ సీపీ నేత భరత్ ఆరోపణలు


