డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): విశాఖను పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్–2022లో దేశంలోని 4,355 నగరాల్లో జీవీఎంసీ 4వ స్థానం సాధించడం గొప్ప విషయమన్నారు. ఈ ఏడాది మరింత మెరుగైన ర్యాంకు సాధించేందుకు నగర ప్రజల తోడ్పాటు అవసరమని చెప్పారు. పర్యావరణ దినోత్సవం రోజున(ఈ నెల 5న) సాయంత్రం సాగర తీరాన ఈకో–వైజాగ్ పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో నిర్వహించనున్నట్టు తెలిపారు. భావితరాల భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ఐదు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమం కొనసాగనుందన్నారు. పరిశుభ్రత–ఆరోగ్యం, ప్లాస్టిక్ నిషేధం, కాలుష్య నివారణ, పచ్చదనం పెంపు, నీటి పొదుపు కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ ఐదు అంశాలకు సంబంధించి 10 ఎన్‌ఫోర్స్‌మెంట్ వెహికల్స్‌ను ఈ నెల 5న బీచ్‌రోడ్డులో నిర్వహించనున్న ఎకో–వైజాగ్ కార్యక్రమంలో అతిథుల చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ వాహనాల ద్వారా సిబ్బంది నగరంలో అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపడతారన్నారు. ఈ అంశాల దీర్ఘకాలిక అమలుకు ‘ఈకో–ఫండ్’ను కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ డాక్టర్ వి.సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్‌కుమార్ పాల్గొన్నారు.


