ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులకే ప్రాధాన్యత జిల్లాలో గడిచిన ఏడు నెలల్లో జరిగిన ప్రసవాలు 7,133 సర్కారు ఆస్పత్రుల్లో 4,033.. నార్మల్ 2,528 ప్రైవేటులో 3,100..సిజేరియన్లు 70శాతం
వికారాబాద్: వైద్యులు ఉంటే.. సదుపాయాలు ఉండవు.. వసతులు ఉంటే డాక్టర్లు ఉండరు ఇదీ ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి.. కానీ సాధారణ ప్రసవాల్లో ప్రైవేటుతో పోలిస్తే అందనంత ఎత్తులో ఉన్నాయి. ప్రైవేటులో 70శాతం మేర సిజేరియన్ కాగా సర్కారు ఆస్పత్రుల్లో మాత్రం అంతేస్థాయిలో నార్మల్ డెలవరీలు జరుగుతుండటం అభినందనీయం. ప్రైవేటుకు వెళితే ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. అవసరం లేకున్నా సిజేరియన్ చేసి అందిన కాడికి దండుకుంటున్నారు. ప్రతి పది కాన్పుల్లో ఏడు కోతలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అదే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రతి పదింటిలో మూడు మాత్రమే సిజేరియన్ చేస్తున్నారు. మిగిలినవన్నీ సాధారణ ప్రసవాలే. అయితే పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రుల్లో ఎక్కువ జరుగుతున్నాయి. అయితే సదుపాయాలు లేకపోవడం సమస్యగా మారుతోంది. కొంతమంది ప్రభు త్వ వైద్యులు ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తుండగా.. మరికొందరు ప్రైవేటులో పని చేస్తున్నారు. సర్కారు ఆస్పత్రులకు వచ్చే రోగులను వారు పనిచేసే ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు.
ప్రైవేటులో కోతలకే మొగ్గు
సాధారణంగా వైద్య నిపుణులు చెబుతున్నదాన్ని బట్టి 10 నుంచి 15శాతం లోపే గర్భిణుల్లో హైరిస్క్ కేసులు ఉంటాయి. ప్రసవాల సమయంలో వైద్యు లు కాస్త రిస్క్ తీసుకుంటే సాధారణ ప్రసవాలు చేయవచ్చని అంటున్నారు. కానీ ప్రైవేటులో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. 70 శాతం వరకు సిజేరియన్‌కే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో గడిచిన ఏడు నెలల కాలంలో ప్రైవేటులో 3,100 ప్రసవాలు చేయగా ఇందులో 2,232 సిజేరియన్, 868 సాధారణ ప్రసవాలు. ఒక్కో కాన్పునకు రూ.60 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. హైరిస్క్ కేసుల పేరుతో మరింత వసూలు చేస్తున్నారు.
పీహెచ్‌సీల్లో తగ్గుతున్న కాన్పులు
పీహెచ్‌సీల్లో రోజురోజుకూ ప్రసవాల సంఖ్య తగ్గుతోంది. జిల్లాలో రూరల్, అర్బన్ కలుపుకొని 24 పీహెచ్‌సీలు ఉండగా ఆరింటిలో మాత్రమే కాన్పు లు చేస్తున్నారు. 24 గంటలు పనిచేసే ఆస్పత్రుల్లో ప్రసవాలు చేస్తున్నా వాటిలో ఒకటి రెండు మాత్రమే జరుగుతున్నాయి. వీటన్నింటిలో నెలకు 20 నుంచి 30 కాన్పులు మాత్రమేజరుగుతున్నాయి.
సదుపాయాలు లేక ఇబ్బందులు
పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి కొత్త భవనం.. సదుపాయాలన్నీ ఉన్నాయి. వైద్యం మాత్రం సక్రమంగా అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రోజుకు ఒకరు చొప్పున వైద్యులు 24 గంటల పాటు విధులు నిర్వహించి నాలుగు రోజుల వరకు ఆస్పత్రికి రావడం లేదు. ఓపీ సమయంలో డాక్టర్లందరూ హాజరవాల్సి ఉన్నా ఒకరు లేద ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. వికారాబాద్ జనరల్ ఆస్పత్రిలో 86 మంది వైద్యులు, 250 మందికి పైగా సిబ్బంది ఉన్నా సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త భవనం అందుబాటులోకి వచ్చినా సరైన పరికరాలు లేవు. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ పరికరాలు లేక రోగులు ప్రైవేటు గడప తొక్కుతున్నారు. తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో మెటర్నటీ సెంటర్‌లోనూ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైద్యులు ఉదయం 10గంటల తర్వాత వచ్చి మధ్యాహ్నం కాకుండానే హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. మెజార్టీ వైద్యులు నగరం నుంచే రాకపోకలు సాగిస్తున్నారు.
ప్రైవేటు హాస్పిటల్స్‌లోసిజేరియన్లకే మొగ్గు
గడిచిన ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు జరిగిన ప్రసవాలు
హాస్పిటల్ నార్మల్ సిజేరియన్ మొత్తం
ప్రభుత్వ 2,528 1,505 4,033
ప్రైవేటు 868 2,232 3,100
కాన్పుల సంఖ్య పెంచుతాం
జిల్లాలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లలో కాన్పుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నాం. అన్ని కేంద్రాల్లో ప్రసవాలు చేయాలని వైద్యులకు సూచించాం. నిబంధనలకు విరుద్ధంగా.. అవసరం లేకున్నా సిజేరియన్లు చేస్తే చర్యలు తీసుకుంటాం.
– సుధాకర్‌లాల్, డీఎంహెచ్‌ఓ


