భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక మౌలిక వసతుల కల్పనే లక్ష్యం నేడు అన్నివర్గాల నుంచి అభిప్రాయ సేకరణ
మాస్టర్ ప్లాన్‌తో పట్టణాభివృద్ధి
మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగితే పట్టణాభివృద్ధి పనులకు ఒక క్రమబద్దమైన ప్రణాళిక అందుబాటులోకి వస్తుంది. ఏ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలి. ఎక్కడ ఎలాంటి వసతులు కల్పించాలి, భవిష్యత్‌లో పట్టణ విస్తరణ ఎలా ఉండాలనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందరి భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని నిర్ణయించాం.
– బుయ్యని మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్యే, తాండూరు
తాండూరు: పట్టణం రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ తరాలకు అనుగుణంగా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. తాండూరును అన్ని రంగాల్లో పురోగతి వైపు నడిపించే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ప్రస్తుత సమస్యలకు పరిష్కారం చూపడంతోపాటు రాబోయే 20 నుంచి 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీ ఆవిర్భవించి వచ్చే ఏడాదికి 75 సంవత్సరాలు కానుండటంతో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పాలకవర్గం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే మరో అడుగు ముందుకేసి పట్టణీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఉమ్మడి జిల్లాలోనే..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే తొలి మున్సిపాలిటీ తాండూరు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్ల తర్వాత 1953లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 4వేల మంది ఓటర్లతో పురపాలికను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించింది. నాటి నుంచి నేటి వరకు పది సార్లు ఎన్నికలు జరగ్గా మొత్తం 15మంది చైర్మన్లుగా కొనసాగారు. ఈ ప్రాంతంలో నాపరాయి నిక్షేపాలు, సుద్ద(తెల్లమట్టి) వనరులు ఉండటంతో పట్టణ పరిధిలోని 13వ వార్డు గ్రీన్ సిటీని, 19వ వార్డులోని బృందావన్ కాలనీని, 23వ వార్డులోని చించోళి రోడ్డులోని ప్రాంతాలను పారిశ్రామిక వాడ జాబితాలోకి చేర్చారు. ఎనిమిదేళ్ల క్రితం పట్టణ శివారులోని పలు ప్రాంతాలు మున్సిపాలిటీలోకి విలీనమయ్యాయి. దీంతో పట్టణ విస్తీర్ణం పెరిగింది. పారిశ్రామిక వాడలుగా గుర్తించిన ప్రాంతాలు పట్టణంలో కలిసి పోయాయి. ఈ క్రమంలో పాలిషింగ్ యూనిట్లను చాలా వరకు తొలగించారు. ఆయా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకునేందుకు అనుమతులు లభించడం లేదు. మూడు ప్రాంతాల్లోని పారిశ్రామికవాడ జోన్‌లో ఉన్న వాటిని తొలగించి నివాసాలకు అనుకూలమైన కాలనీలుగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్‌లో ప్రధాన అంశంగా మారనుంది.
ప్రధాన అంశాలు
మాస్టర్ ప్లాన్‌లో భాగంగా పట్టణంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ, నిరంతర తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, పౌర సేవలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. విద్య, వైద్య రంగాల్లో అవసరమైన మార్పులు, కొత్త సౌకర్యాల కల్పన, ప్రజలకు అందుబాటులో మెరుగైన సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలు, రవాణా మార్గాలు, పార్కులు, ప్రజావసరాల స్థలాలను క్రమబద్ధీకరించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశం లభించనుంది.
నేడు మేధావులతో సమావేశం
మాస్టర్ ప్లాన్ తయారీపై మేధావుల అభిప్రాయం తీసుకోనున్నారు. ఇందులో భాగంగా నేడు (బుధవారం) పట్టణానికి చెందిన మేధావులు, వ్యాపారులు, విద్యావంతులు, కుల సంఘాల ప్రతినిధు లు, అఖిలపక్షాల నాయకులతో రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తారు.
వచ్చే ఏడాది వజ్రోత్సవాలు
తాండూరు మున్సిపాలిటీ ఏర్పడి 74 సంవత్సరాలు కావస్తోంది. వచ్చే ఏడాది వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని నిర్ణయించాం. రోజు రోజుకూ పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. అందుకోసం అన్ని వర్గాల వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తాం.
– పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, చైర్‌పర్సన్, తాండూరు మున్సిపల్


