బషీరాబాద్: గుర్తుతెలియని వ్యక్తి చైన్ లాగడంతో బెంగళూరు – నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు నావంద్గి స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. సుమారు 15 నిమిషాల పాటు ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 11.40 నిమిషాల సమయంలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా రైలు నిలిచిపోవడంతో అప్రమత్తమైన లోకో పైలెట్ ఇంజన్ నుంచి కిందకు దిగి వెనుక వైపునకు పరుగులు తీశారు. చైన్ ఎవరు లాగారోనని పరిశీలించారు. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికుల్లో ఏం జరిగిందోనన్న ఉత్కంఠ నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తి చైన్ లాగడంతోనే రైలు నిలిచిపోయిందని లోకో పైలెట్ మీడియాకు వెల్లడించారు. మరోవైపు రైల్వే గేటు మధ్యలో రైలు నిలవడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు బారులు తీరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా, రైలు ముందున్న పట్టాలపై మరో గూడ్స్ రైలు నిలిచి ఉండటంతో రెండు రైళ్లు ఒకే పట్టాలపైకి వచ్చాయని తొలుత అందరు భావించారు. అయితే, అవి వేర్వేరు పట్టాలపై ఉన్నట్లు చివరకు తేలడంతో ప్రమాదమేమిలేదని గుర్తించారు. పైలెట్ అన్నీ పరిశీలించిన తర్వాతా రైలు తిరిగి బయలుదేరడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.


