హుడాకాంప్లెక్స్: ఇటీవల జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి మంగళవారం తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ తరఫున జిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ బి.పరాంకుశం, పి.శ్రీనివాసులు, ఎండీ షాయాద్, చిట్టిబాబు, ఎండీ రఫీక్, కళమ్మ పాల్గొన్నారు.
ఆమనగల్లు: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఫ్యూచర్‌సిటీ ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యయ తెలిపారు. మండలంలో ఉన్న హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై ప్రమాదకర బ్లాక్ స్పాట్లను మంగళవారం స్థానిక పోలీసు, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలను తొలగిస్తామన్నారు. పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న దుకాణాలు, ఆక్రమణలను తొలగించి వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చూస్తామని వివరించారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఆమనగల్లు ట్రాఫిక్ సీఐ శంకరయ్య, మహేశ్వరం ట్రాఫిక్ సీఐ అశోక్, మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంచాల: మండలంలోని ఆరుట్లలో బెల్ట్ దుకాణాలు బంద్ చేయాలని పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసింది. ఈ మేరకు మంగళవారం మంచాల ఎస్‌ఐ నాగేశ్వర్ రావుకు తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మానుపాటి శోభ కుమార్, ఉప సర్పంచ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలో విచ్చిలవిడిగా మద్యం దుకాణాలు వెలిశాయన్నారు. యువత మద్యానికి అలవాటుపడి బంగారు భవిష్యత్‌ను పాడు చేసుకోకూడదని, గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉండాలంటే కచ్చితంగా మద్యం విక్రయాలను నిలిపి వేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు పున్నం రాము, పద్మ, శ్రావణ్, శేఖర్, బాను, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్: ఆధునిక, సాంకేతిక బోధనతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని గిరిజన గురుకుల విద్యాసంస్థల సెక్రటరీ సీతాలక్ష్మి అన్నారు. పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో మంగళవారం గిరిజన గురుకుల విద్యాసంస్థల ఆధ్వర్యంలో శ్రీసాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యకోసం ఉపాధ్యాయుల సాధికారతశ్రీ అంశంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీతాలక్ష్మి మాట్లాడుతూ.. డిజిటల్ సాంకేతిక సాధనాలు, సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. తరగతి గదుల్లో ఏఐ సాధనాలను వినియోగించే విధానాలను తెలుసుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతికతను బోధనలో అనుసంధానం చేయడం ద్వారా బోధనా ప్రక్రియ సులభతరం అవుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరుచుకొని, విద్యార్థులకు సాంకేతిక ఆధారిత విద్యను అందించడంద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో గురుకుల విద్యాసంస్థల జాయింట్ సెక్రటరీ వెంకన్న, రీజినల్ కో ఆర్డినేటర్ నాగార్జునరావు, డిగ్రీ కళాశాలల డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ వేణుగోపాల్, అకాడమిక్ డిప్యూటీ సెక్రటరీ వెంకటేశం, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కళాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు: తలకొండపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో పలువురు పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్‌ఫోన్‌లను గుర్తించి పోలీసులు తిరిగి బాధితులకు అప్పగించారు. దొంగిలించబడిన సెల్‌ఫోన్‌లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి రికవరీ చేశారు. తలకొండపల్లి పోలీసు స్టేషన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో 11 మంది బాధతులకు సీఐ జానకిరాంరెడ్డి, ఎస్‌ఐ కానుగుల శేఖర్ సెల్‌ఫోన్‌లు అప్పగించారు. రికవరీలో చొరవచూపిన క్రైం కానిస్టేబుల్ జాషువాను సీఐ అభినందించారు.


