ప్లాట్లు అందక పాట్లు | - | Sakshi
Sakshi News home page

ప్లాట్లు అందక పాట్లు

Oct 28 2026 8:18 AM | Updated on Oct 28 2026 8:18 AM

ప్లాట్లు అందక పాట్లు

కందుకూరు: గత ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములకు సంబంధించి ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి చేసిన ప్లాట్లు అందక చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల మరో నెల అంటూ అధికారులు దాటవేస్తుండటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యూచర్‌సిటీ పరిధిలో భూములు కోల్పోయిన చాలా మంది రైతులు ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు.

ఎకరాకు 121 గజాలు

గత ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో కందుకూరు, యాచారం, కడ్తాల్‌ మండలాల్లో 19,333 ఎకరాల భూమిని సేకరించడానికి నిర్ణయించి దాదాపు 14 వేల ఎకరాల వరకు సమీకరించింది. పరిహారంతో పాటు అదనంగా ఎకరాకు 121 గజాల చొప్పున ప్లాటుకు సంబంధించి సర్టిఫికెట్లు జారీ చేసింది. అప్పట్లో మీర్‌ఖాన్‌పేట, పంజగూడ రెవెన్యూలో సుమారు 622 ఎకరాల విస్తీర్ణంలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో మెగా లేఅవుట్‌ నిర్మించారు.

ఏడాది దాటినా..

మొదట్లో ఏర్పాటు చేసిన ఆ లేవుట్‌లో కొంత భాగాన్ని మళ్లీ అమేజాన్‌ సంస్థకు ప్రస్తుత ప్రభుత్వం కేటాయించింది. దీంతో లబ్ధిదారులందరికీ సరిపడా ప్లాట్లు లేక కొంతమంది వరకే డ్రా ద్వారా అధికారులు కేటాయించారు. ఆ మెగా వెంచర్‌లో జూలై 2025 7వ తేదీ నుంచి 11వ తేదీ మధ్య లబ్ధిదారులకు లాటరీ ద్వారా ప్లాట్లను పంపిణీ చేశారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎఫ్‌సీడీఏ కమిషనర్‌ శశాంక, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా డ్రా ప్రక్రియ ప్రారంభించారు. అప్పట్లో ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో కందుకూరు, యాచారం మండలాల పరిధిలో రైతుల నుంచి సేకరించిన భూములకు ఎకరాకు 121 గజాల చొప్పున కేటాయించారు. అందులో అర ఎకరం నుంచి 5 ఎకరాల్లోపు రైతులకు మాత్రమే ప్లాట్లు కేటాయించారు. దీంతో వారి అవసరాన్ని బట్టి విక్రయాలు చేపట్టారు. ఒక్క కందుకూరు మండలంలో భూములు కోల్పోయిన రైతులకు 605 నుంచి 2,420 గజాల వరకు దాదాపు 199 మందికి ప్లాట్లు అందాల్సి ఉంది. వీటికి తోడు యాచారం మండలంలో లబ్ధిదారులు అదనంగా ఉన్నారు. ఐదెకరాల పైబడి భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడు కొత్తగా లేఅవుట్‌ నిర్మిస్తారో.. మళ్లీ తమకు ఎప్పుడు ప్లాట్లు కేటాయిస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. అవసరానికి అమ్ముకోవడానికి సర్టిఫికెట్‌ మినహా మరేమీ లేక అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీకి భూ సేకరణ

పరిహారంతో పాటు ఎకరాకు 121 గజాల చొప్పున ప్లాటు ఇస్తామని ప్రకటన

టీజీఐఐసీ ఆధ్వర్యంలో మెగా లేఅవుట్‌ నిర్మాణం

సర్టిఫికెట్లతో సరిపెట్టిన అధికారులు

వెంచర్‌లో సరిపడా స్థలం లేక అందరికీ జరగని కేటాయింపులు

ఏడాదికి పైగా నిరీక్షిస్తున్న లబ్ధిదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement