● రాజకీయ యుద్ధానికి రెడీ
● స్కామ్‌లు, దొంగలెక్కలను బయటపెట్టింది నేనే
● మహా పాదయాత్రలో తీన్మార్ మల్లన్న
కొడంగల్/బొంరాస్‌పేట: కొడంగల్‌లో బీసీ ఎమ్మెల్యే గెలవడం ఖాయమని, రాష్ట్రంలో రాజకీయ యుద్ధానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధంగా ఉందని ఆపార్టీ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆయన చేపట్టిన మహా పాదయాత్ర పదోరోజు శనివారం సాయంత్రం కొడంగల్‌కు చేరింది. ఈమేరకు స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ఆయన మాట్లాడారు. రాబోయేది బీసీల రాజ్యమేనన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను మట్టికరిపించేది టీఆర్పీయేనని ధీమా వ్యక్తంచేశారు. గతంలో జరిగిన స్కామ్‌లను, దొంగలెక్కలను బయటపెట్టింది తానేనని వెల్లడించారు. జైలుపాలైనా భయపడలేదని, కులగణన పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని తెలిపారు. రేవంత్‌రెడ్డి బీసీలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. దివంగత ఎంపీ విఠల్‌రావును గుర్తు చేస్తూ బీసీ వర్గం ఏకై క ఎంపీగా పేర్కొన్నారు. టీఆర్పీ వస్తే ముదిరాజ్‌లను బీసీ– ఏలో చేరుస్తామని, కార్పొరేట్ సంస్థల్లో ఉచిత విద్య, వైద్యం అందేలా చూస్తామని ప్రకటించారు. రెడ్లు, వెలమల ఓట్లు తమ పార్టీకి అక్కర్లేదన్నారు. కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు గౌస్, నాయకులు జైపాల్, అంజద్, రజినీకుమార్, మదన్‌మోహన్, అశోక్, వనజ, రేలారే గంగా తదితరులు ఉన్నారు.
బీసీ నాయకుల సన్మానం
తాండూరు టౌన్: తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్నను శనివారం బీసీ సంఘం తాండూరు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు వెంకటేశ్, బస్వరాజ్, పరమేశ్, వివేక్, కిరణ్, సంజు, జోసెఫ్, శ్రీకాంత్, చిన్ని తదితరులు ఉన్నారు.


