ఆటోవాలాలను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆటోవాలాలను ఆదుకోవాలి

Sep 7 2026 10:44 AM | Updated on Sep 7 2026 10:44 AM

తాండూరు: ఎన్నికల సమయంలో ఆటోడ్రైవర్‌లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ బాకీ కార్డు నిరసన కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారంటీలు, 420 హామీల్లో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేసి ఆటోవాలాలను ఆదుకోవాలని ఆటో ర్యాలీ నిర్వహించారు. స్వయంగా ఆటో నడుపుతూ నిరసనలో పాల్గొన్నారు. అనంతరం ఇందిరాచౌక్‌ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలతో పాటు ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల జీవిత బీమా, ప్రతి ఏటా రూ.12 వేల చొప్పున ఆర్థిక భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చి మరిచారని విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఆటోవాలలకు ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదన్నారు. అనంతరం పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై వినూత్న నిరసన తెలిపారు. కౌన్సిలర్లు, మహిళలతో కలిసి బస్వణ్ణకట్ట ప్రాంతంలో రోడ్లను శుభ్రం చేశారు. ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. అంతకు ముందు తాండూరు పట్టణంలోని విలియంమూన్‌ మైదానంలో మార్నింగ్‌ వాక్‌ చేసి వాకర్‌లతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ పట్లోళ్ల దీపనర్సింహులు, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మహేశ్వరి, నవినాగౌడ్‌, సురేశ్‌, ఇర్షద్‌, జావీద్‌, మా జీ కౌన్సిలర్లు శోభారాణి, పరిమళ, అనురాధ నాయకులు శ్రీనివాసచారి, నర్సింలు తదితరులున్నారు.

కాంగ్రెస్‌ను గద్దె దించేవరకు ఉద్యమిద్దాం

బషీరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో హామీలను గాలికి వదిలేసి ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం బషీరాబాద్‌లో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీ అనంతరం వివేకానంద చౌరస్తాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని, హామీల అమలు కోసం ప్రభుత్వాన్ని ప్రజలే గల్లాపట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు. అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. తాండూరులోని మెడికల్‌ కాలేజీ, ఆర్డీఓ కార్యాలయం కొడంగల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి తన్నుకు పోతున్నాడని, ఇక్కడి ప్రజల దాహార్తి తీర్చే కాగ్నా నది నుంచి తాగునీటిని కొడంగల్‌కు తరలిస్తున్నా ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

మళ్లీ బీఆర్‌ఎస్‌దే అధికారం

యాలాల: గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, సంక్షేమ పథకాల అమలుగురించి ప్రశ్నిస్తే బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సమరభేరి’కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అలవి కానీ హామీలిచ్చి ప్రజలు మోసం చేసిందన్నారు. తాండూరులో స్థానికేతరుడైన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కాగ్నా నది నుంచి కొడంగల్‌కు తాగునీటి తరలించే ప్రక్రియలో మొదట తాండూరుకు సాగు, తాగునీరు ఇచ్చాకే తరలించేలా ఉద్యమిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారం రాబోతుందని, అప్పుడు ఒక్కొక్కరిని విడిచిపెట్టేదే లేదన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్‌ చైర్మన్‌ వడ్డే రాములు, బీఆర్‌ఎస్‌ మండల గౌరవ అధ్యక్షుడు మల్లారెడ్డి, ఈజీఎస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యుడు శివకుమార్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్‌, మాజీ వైస్‌ ఎంపీపీలు అనంతయ్య, రమేశ్‌, మాజీ సర్పంచ్‌లు రవికుమార్‌గౌడ్‌, బోయిని సాయిలు, మాజీ డైరెక్టర్‌ ముస్తఫా, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, శరణుభూపాల్‌, శ్రీనివాస్‌గౌడ్‌, మహేశ్వర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌, మెట్లి కృష్ణ, లాలప్ప, రాంచంద్రాడ్డి తదితరులు ఉన్నారు.

మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement