సరిహద్దు మండలం.. సమస్యలకు నిలయం | - | Sakshi
Sakshi News home page

సరిహద్దు మండలం.. సమస్యలకు నిలయం

Aug 11 2026 7:21 AM | Updated on Aug 11 2026 7:21 AM

బషీరాబాద్‌: ఒకప్పుడు రాజకీయ, పరిపాలనా పరంగా ప్రత్యేక గుర్తింపు పొందిన బషీరాబాద్‌ మండలం ప్రస్తుతం అభివృద్ధి, సమస్యలతో సతమతమవుతోంది. నిజాం కాలంలో జిల్లా పరిపాలనా కేంద్రంగా వెలుగొందిన ఈ ప్రాంతం నేడు సాగునీటి కొరత, నిధుల లేమి, మౌలిక సదుపాయాల సమస్యలతో వెనుకబడిన మండలంగా మారింది. కర్ణాటక సరిహద్దులో ఉండటం కూడా అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని 39 గ్రామ పంచాయతీలు.. సుమారు 31 వేల మంది ఓటర్లు ఉన్నారు. జీపీలకు ప్రత్యేక నిధులు లేక అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులతోనే నెట్టుకొస్తున్నాయి.

ఎత్తిపోతలకు మోక్షం ఎప్పుడో?

జీవన్గీ, నావంద్గీ, ఇందర్‌చెడ్‌ ప్రాంతాల్లో కాగ్నా నదిపై నిర్మించిన మూడు ఎత్తిపోతల పథకాలు ఏళ్లుగా మూతపడి ఉన్నాయి. ఒకప్పుడు వీటి ద్వారా 1,750 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేది. నిర్వహణ లోపం, మరమ్మతులు చేయకపోవడంతో పథకాలు నిర్వీర్యమయ్యాయి. దీంతో వందల ఎకరాలు బీడుగా మారాయి. రైతులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పునరుద్ధరణ పనులు చేపట్టలేదు.

38,417 ఎకరాల సాగుభూమి

మండలంలో 38,417 ఎకరాల సాగుభూమి ఉండగా, అందులో 32,728 ఎకరాలు మెట్ట, 5,689 ఎకరాలు మాత్రమే తరి భూములు ఉన్నాయి. సాగునీటి వసతి లేక రైతులు వర్షాధార పంటలైన పత్తి, కంది, మినుము, పెసర, శనగ, జొన్నల సాగు చేస్తున్నారు. మండలంలో 51 చెరువులు, కుంటలు.. 2,338 ఎకరాల ఆయకట్టు ఉంది. కేవలం 500 ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది.

భారీగా వలసలు

మండలంలో ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉండటంతో వేలాది మంది వలస బాట పడుతున్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో గుర్తించిన వివరాల ప్రకారం గిరిజన, వడ్డెర, బుడగజంగం, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన సుమారు 9 వేల మంది హైదరాబాద్‌, ముంబై తదితర నగరాలకు వలస వెళ్లారు. అనేక గ్రామాల్లో ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి. మండలంలో అపార నాపరాతి ఖనిజ సంపద ఉన్నా పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయనే విమర్శలు ఉన్నాయి. పరిశ్రమలు నెలకొల్పితే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు తగ్గే అవకాశం ఉంది.

మౌలిక వసతులు కరువు

మండలంలోని అనేక గ్రామాల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. బషీరాబాద్‌, జీవన్గీ, మైల్వార్‌, ఎక్మాయి, కాశీంపూర్‌, మంతట్టి, దామర్‌చెడ్‌, నవల్గా, నీళ్లపల్లి తదితర గ్రామాల్లో అంతర్గత రహదారులు అసంపూర్తిగా ఉన్నాయి. కాలువల నిర్మాణం పూర్తికాక మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. వర్షాకాలంలో అనేక కాలనీలు చిత్తడిగా మారుతున్నాయి. జీవన్గీ ఎస్సీ కాలనీలో చిన్న వర్షానికే ఇళ్లలోకి నీరు చేరుతోంది. బాద్లాపూర్‌, బాబునాయక్‌, హంక్యానాయక్‌, తౌర్యానాయక్‌, నంద్యానాయక్‌, కంసాన్‌పల్లి తండాలకు సరైన రవాణా సౌకర్యాలు లేవు. కొన్ని ప్రాంతాలకు బీటీ రోడ్లు లేక అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు కూడా చేరలేని పరిస్థితి నెలకొంది.

15వ ఆర్థిక సంఘం నిధులే దిక్కు

గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇటీవల జీపీలకు 15వ ఆర్థిక సంఘం కింద రూ.1.35 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు తాగునీరు, పారిశుధ్య నిర్వహణకే సరిపోతున్నాయని సర్పంచులు చెబుతున్నారు. వెనుకబడిన మండలంగా గుర్తింపు పొందిన బషీరాబాద్‌కు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అవసరమని ప్రజాప్రతినిధులు, రైతులు, సర్పంచులు కోరుతున్నారు.

నేడు మండల సాధారణ సమావేశం

మండల సాధారణ సమావేశం మంగళవారం జరగనుంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి హాజరుకానున్నారు. సాగునీరు, నిధులు, మౌలిక వసతులు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

మూతపడిన మూడు ఎత్తిపోతల పథకాలు

బీడుగా 1,750 ఎకరాల ఆయకట్టు

ఉపాధి కోసం వేలాది మంది వలస బాట

నేడు మండల సాధారణ సమావేశం

గళం విప్పనున్న సర్పంచులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement