ధారూరు: మండల కేంద్రంలో కొలువుదీరిన కపిలేశ్వర స్వామికి మంగళవారం 108 కలశాలతో అభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి చెన్న బసవయ్య స్వామి సోమవారం తెలిపారు. మాస శివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
బొంరాస్‌పేట: దుద్యాల మండలం హకీంపేటలో కొనసాగుతున్న ఎడ్యుకేషన్ హబ్ పనులను బుధవారం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ పరిశీలించనున్నట్లు కేఎల్‌ఎస్‌ఆర్ జనరల్ మేనేజర్ హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. హకీంపేట సమీపంలో 248 ఎకరాల్లో రూ.వేయి కోట్లతో చేపట్టిన యంగ్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ స్కూల్, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఫిజియోథెరపీ, పారామెడికల్ కళాశాల, పశువైద్యశాల, ఇంజనీరింగ్ కళాశాల, వసతి గృహా నిర్మాణాలను శ్రీధర్ పరిశీలించనున్నారు.
కొడంగల్ రూరల్: నాగార్జునసాగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వరుణయాగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సోమవారం దూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట డీడీఎన్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థాచారి ఉన్నారు.
తాండూరు టౌన్: బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన రమేష్ కుమార్ సోమవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును నగరంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు రమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప
తాండూరు టౌన్: కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం తాండూరులో జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌక్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ కూలీలు, పరిశ్రమల కార్మికులకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. లేబర్ కోడ్లను అమలులోకి తెచ్చి పూర్తిగా కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. కనీస వేతనాలను అమలు చేయాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మల్కయ్య, నాయకులు చంద్రప్ప, లాలప్ప, అంబరప్ప, వెంకటప్ప, గోవిందు, శ్రీశైలం, నర్సిములు, గుండప్ప, లక్ష్మి, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.


