తాండూరు: విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటింది. ఇప్పటి వరకు విద్యార్థులకు యూనిఫాం అందలేదు. ఆగస్టు 15వ తేదీ జెండా వందనం నాటికి ప్రతి విద్యార్థీకి యూనిఫాం అందించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దుస్తులు కుట్టే బాధ్యతలు మహిళా సంఘాల సభ్యులకు అప్పటించారు. పంద్రాగస్టుకు మరో నాలుగు రోజులే ఉండటంతో పూర్తిస్థాయిలో పంపిణీ సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా ప్రతి విద్యార్థికీ రెండు జతల చొప్పున యూనిఫాం అందజేస్తారు. జిల్లాలో మొత్తం 1,066 ప్రభుత్వ పాఠశాలలు.. 93,205 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి రెండు జతల చొప్పున 1,86,410 ఇవ్వాల్సి ఉంది. 1,134 మంది దుస్తులు కుడుతున్నారు. ఇప్పటి వరకు 45,885 జతలు పూర్తయ్యాయి. ఇందులో 29,774 యూనిఫారాలను ఆయా పాఠశాలలకు పంపిణీ చేశారు. మరో 23,243 కుట్టాల్సి ఉంది.
కూలి సరిపోవడం లేదు
ఒక జత యూనిఫాం కుట్టినందుకు ప్రభుత్వం రూ.75 చెల్లిస్తోంది. రెండు జతలకు కలిపి రూ.150 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ మొత్తం స్టిచ్చింగ్ మెటీరియల్‌కు కూడా సరిపోవడం లేదని మహిళా సంఘాలకు చెందిన దర్జీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఒక్క జత యూనిఫామ్ కుడితే రూ.500లకు పైగా తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం కూలి రేటు పెంచాలని వారు కోరుతున్నారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1,066
విద్యార్థుల సంఖ్య 93,205 మంది
అవసరమైన దుస్తులు 1,86,410
ఇప్పటికే 70శాతం మేర రెడీ
ఒక్కో జతకు చెల్లిస్తున్న మొత్తం రూ.75
కూలి సరిపోదంటున్న మహిళలు
ప్రతి విద్యార్థికీ ఒక జత పంపిణీకి ఏర్పాట్లు
సిద్ధం చేస్తున్న మహిళా సంఘాల సభ్యులు


