ఐదుగురిలో ఒకరు గల్లంతే..!
కొడంగల్‌లో వంద శాతం ఎన్యూమరేషన్ పూర్తి
వికారాబాద్/బషీరాబాద్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్)కు నేటితో తెరపడనుంది. జిల్లాలో 47రోజుల పాటు సాగిన ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగగా మొత్తం 10,17,671 మంది ఓటర్లను ఎన్నికల సిబ్బంది పరిశీలించారు. ఇందులో 8,06,348 మంది ఓటర్లు క్రియాశీలంగా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 2,07,689 మంది ఓటర్లు ఏఎస్‌డీ (అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్) జాబితాలోకి వెళ్లారు.
అక్టోబర్ 15వరకు వివరాల సేకరణ
జిల్లాలో తొలుత ఎన్యూమరేషన్ ప్రక్రియ కొంత నెమ్మదించినా కలెక్టర్ చొరవతో పుంజుకుంది. 2002లో చివరగా ఎస్‌ఐఆర్ నిర్వహించారు. 2025లో తిరిగి ప్రారంభించిన ఎస్‌ఐఆర్‌కు 2002 ఓటరు జాబితాను ప్రామానికంగా తీసుకుని ప్రస్తుత జాబితాతో పోల్చి చూశారు. 2025లో ఓటరు జాబితాలో ఓటరుగా నమోదై ఉండి 2002 లేకుంటే ఆ ఓటర్లను మ్యాపింగ్ చేసి వారి కుటంబీకుల పేర్లతో పోల్చి చూశారు. 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారు, చిరునామా వద్ద అందుబాటులో లేని వారు, రెండు ఓట్లు నమోదు ఉన్న వారి వివరాలను ప్రత్యేకంగా గుర్తించారు. జిల్లాలో దాదాపు 2.07 లక్షల ఓట్లు తొలగింపునకు అర్హమైనవిగా తేల్చారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తుది పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం అనంతరం వీటిపై నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం వరకు 8.06 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. ఏఎస్‌డీ ఓటర్లను కలుపుకొని చూస్తే జిల్లా పురోగతి 99.64 శాతానికి చేరింది. కేవలం 3,634 ఫారాలే పెండింగ్‌లో ఉండడంతో ప్రక్రియ దాదాపు పూర్తయినట్టేనని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 17వరకు నోటీసులు ఇచ్చి అక్టోబర్ 15వ తేదీ వరకు వివరణ తీసుకోనున్నారు.
తాండూరులో 64,413 ఓట్లు గల్లంతు
జిల్లాలో అత్యధిక ఏఎస్‌డీ ఓటర్లు తాండూరు నియోజకవర్గంలో నమోదయ్యారు. మొత్తం 64,413 మంది ఓటర్లు జాబితాలో కనిపించలేదు. ఉపాధి, ఉద్యోగాలు, విద్య తదితర కారణాలతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు.
కొడంగల్ అగ్రస్థానం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం ఎస్‌ఐఆర్‌లో అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ వంద శాతం ప్రక్రియ పూర్తి అయింది. ఒక్క ఫారం పెండింగ్‌లో లేకపోవడం విశేషం. పరిగి నియోజకవర్గం 99.99 శాతం, వికారాబాద్ నియోజకవర్గం 99.08 శాతం పురోగతిని నమోదు చేశాయి. నాలుగు నియోజకవర్గాల్లోనూ ఎన్నికల సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టి డేటా సేకరించారు.
10.17 లక్షల ఫారాల పరిశీలన
పెండింగ్‌లో 3,634 ఫారాలు
తాండూరులో అత్యధికంగా ఓట్లు గల్లంతు!
ఎస్‌ఐఆర్ గణాంకాలు జిల్లాలో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టాయి. మొత్తం ఓటర్లలో 20.40 శాతం మంది ఏఎస్‌డీ జాబితాలోకి వెళ్లారు. అంటే ప్రతి ఐదుగురు ఓటర్లలో ఒకరు తమ నమోదిత చిరునామా వద్ద లేరని తేలింది. మరణాలు, వలసలు, చిరునామా మార్పులు, ద్వంద నమోదులు ఇందుకు కారణాలుగా గుర్తించారు. తుది జాబితా విడుదల తర్వాత జిల్లాలో క్రియాశీల ఓటర్ల సంఖ్య 8.06 లక్షల వద్దే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ నేటితో ముగియడంతో ఇప్పుడు ఎన్నికల యంత్రాంగం తుది ఓటరు జాబితా రూపకల్పనపై దృష్టి సారించనుంది. రాబోయే ఎన్నికల్లో మరింత పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా అందుబాటులోకి రానుంది. దీంతో జిల్లాలో ఓటరు జాబితా ప్రక్షాళనకు కీలక అధ్యాయం ముగిసినట్టయింది.


