రేపు హైదరాబాద్‌లో ప్రత్యక్ష ఎంపిక
తాండూరు టౌన్: టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ పరిధిలో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ శ్రీదేవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఏడాది పాటు శిక్షణ ఉంటుందన్నారు. అర్హులైన వారు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నెలకు రూ.16 వేల నుంచి రూ. 19 వేల వరకు, అర్హతల ప్రకారం నిర్దేశిత స్టైఫండ్ ఉంటుందన్నారు. ఈనెల 11వ తేదీన ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ రెండో అంతస్తులో నిర్వహించే ప్రత్యక్ష ఎంపికకు హాజరుకావాలన్నారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాల ఒరిజినల్స్, జిరాక్స్ సర్టిఫికెట్లు, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, నాట్స్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఉండాలని చెప్పారు.
పరిగి: కాలమిస్ట్, ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత ప్రచార కార్యదర్శి డాక్టర్ భాస్కరయోగి ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుని కలిసారు. నగరంలోని బీజేపీ అధ్యక్షుడి నివాసంలో ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై చర్చించారు. అనంతరం భాస్కరయోగి రాసిన పలు పుస్తకాలను ఆయనకు అందించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదారాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఈ బేటీ ఆసక్తికరంగా మారింది. భాస్కరయోగి బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఆశిస్తున్నట్టు ఉహాగానాలు వినిపిస్తున్నాయి.
ధారూరు: సెల్ఫీ సరదా ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన మండల కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన దంపతులు ప్రాజెక్టులో బోటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సెల్ఫీదిగేందుకు యత్నించారు. ఇద్దరూ ఒకే వైపు వచ్చి సెల్ఫీ దిగుతున్న క్రమంలో బోట్ అదుపుతప్పి ప్రాజెక్టు నీటిలో పడిపోయారు. వారు లైఫ్‌జాకెట్స్ ధరించడంతో ప్రమాదం తప్పింది. గమనించిన లైఫ్ గార్డ్స్ వెంటనే అప్రమత్తమై వారిని బోట్‌లో ఒడ్డుకు చేర్చారు.
హుడాకాంప్లెక్స్: హైడ్రా ఉద్యోగాల ఎంపికకు అనూహ్యంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరుకావడంతో దేహదారుఢ్య పరీక్షల గడువును ఈ నెల 11 వరకు పొడిగించారు. తొలుత రెండు రోజులపాటు నిర్వహించాల్సిన ఈవెంట్స్‌కు వేలాదిమంది తరలిరావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 100 డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు మాత్రమే ఉన్నప్పటికీ.. హాజరైన ప్రతి అభ్యర్థికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇబ్రహీంపట్నం: డా.బీఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ 2026–27 ప్రవేశాల గడువును సెప్టెంబర్ 9 వరకు పెంచినట్లు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాధిక, సెంటర్ కో–ఆర్డినేటర్ శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక ఓపెన్ స్టడీ సెంటర్–172లో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ ప్రథమ సంవత్సరంలో కోర్సుల్లో చేరేందుకు అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణులై, రెండేళ్ల ఐటీఐ కోర్సు చేసిన విద్యార్థులు సైతం ప్రవేశాలకు అర్హులని చెప్పారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజులను సకాలంలో చెల్లించాలన్నారు.


