తాండూరు: పట్టణ పరిసర ప్రాంతాల్లోని నాపరాతి పాలిషింగ్ యూనిట్‌ల కారణంగా కాలుష్యం పెరుగుతోంది. దీంతో గత ప్రభుత్వం పాలిషింగ్ యూనిట్‌లను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు మండల పరిధిలోని జిన్‌గుర్తిలో రూ.వందల కోట్లు వెచ్చించి పారిశ్రామిక వాడ ఏర్పాటుకు భూ సేకరణ చేపట్టింది. ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు టీజీఐఐసీ ద్వారా అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ ప్రాసెసింగ్ యూనిట్‌ల ఏర్పాటుకు వ్యాపారులు దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.
దేశంలోనే అత్యధిక కాలుష్యం
నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్ మండలాల్లో వేలాది ఎకరాల్లో నాపరాతి నిక్షేపాలు విస్తరించి ఉన్నాయి. తాండూరు నాపరాతికి మార్కెట్‌లోనూ డిమాండ్ అధికం. ఈ ప్రాంతంలో 700 వరకు నాపరా తి పాలిషింగ్ యూనిట్‌లు కొనసాగుతున్నాయి. వీటి కారణంగా దేశంలో తాండూరు పట్ణంలోనే అత్యధిక కాలుష్యం నమోదైందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గుర్తించారు. దీంతో వాటిని తరలించాలని స్థానికుల నుంచి ఒత్తిడి పెరిగింది.
262 ఎకరాల భూ సేకరణ
తాండూరు లైమ్‌స్టోన్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కావాల్సిన భూ సేకరణ, అభివృద్ధి పనుల ను ప్రభుత్వం టీజీఐఐసీకి అప్పగించింది. భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.12 లక్షల చొప్పు న 262 ఎకరాల భూమికి సుమారు రూ.314 కోట్ల పరిహారం చెల్లించారు. అందులో 10.2 శాతం గ్రీన్ కారిడార్‌కు స్థలం కేటాయించారు. మిగిలిన భూమిలో 422 ప్లాట్‌లు ఏర్పాటు చేశారు. పారిశ్రామిక వాడ అభివృద్ధి కోసం టీజీఐఐసీ నుంచి రూ.21.30 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. 2023 అక్టోబర్‌లో నాటి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పారిశ్రామిక వాడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా బీటీ రోడ్డు, విద్యుత్, తాగునీటి సరఫరా, మురుగునీటి కాలువలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పనులు కొనసాగుతున్నాయి.
చదరపు గజం రూ.3వేలు
లైమ్‌స్టోన్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్‌లో పాలి షింగ్ యూనిట్ యజమానులు పరిశ్రమలను ఏర్పా టు చేసేందుకు టీజీఐఐసీ చదరపు గజం రూ.3 వేలు గా నిర్ధారించింది. గతేడాది వ్యాపారుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. కానీ పాలిషింగ్ యూనిట్ నిర్వాహకులు ఎవరూ ముందుకు రాలేదు. చదరపు గజానికి రూ.3 వేలు పెట్టి స్థలం కొనుగోలు చేయలేమని నాపరాతి పాలిషింగ్ నిర్వాహకులతో పాటు తాండూరు స్టోన్ మర్చంట్స్ అసోషియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. పాలిషింగ్ యూనిట్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉచితంగా స్థలాలను అందించాలని లేదంటే నామినల్ ధరలకు కేటాయించాలని ఇటీవల సంబంధిత శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి విన్నవించారు.
జీఎస్టీ భారం.. రాయల్టీ బాదుడు
నాపరాతి పరిశ్రమలపై ప్రభుత్వం అధికంగా పన్నుభారం మోపుతోందని వ్యాపారులు వాపోతున్నారు. పక్కనే ఉన్న కర్ణాటక ప్రభుత్వం మైనింగ్‌ను ప్రోత్సహించి పన్నుల భారం తగ్గించిందని.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అధిక భారం మోపుతోందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయల్టీ, జీఎస్టీ పన్ను భారం తగ్గించాలని కోరుతున్నారు.
జిన్‌గుర్తిలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడ
లైమ్‌స్టోన్ ప్రాసెసింగ్ యూనిట్‌ల ఏర్పాటుకు 422 ప్లాట్లు
చదరపు గజానికి రూ.3 వేలుగా నిర్ధారించిన టీజీఐఐసీ
ఏడాది క్రితం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం
ముందుకు రాని నిర్వాహకులు


