కుల్కచర్ల: మండల పరిధిలో మరొక మార్వాడీ బంగారు దుకాణం బోర్డు తిప్పేసింది. ఎస్‌ఐ రమేశ్ తెలిపిన ప్రకారం.. చాపలగూడెం గ్రామానికి చెందిన రాములు ఏప్రిల్ 1వ తేదీన నాలుగు తులాల బంగారు పుస్తెలతాడు, గొలుసు చేయాలని కేసరియా జ్యూవెలర్స్ దుకాణ యజామని కై లాస్‌కు రూ.4 లక్షలు చెల్లించాడు. ఇటీవల దుకాణం తెరవడం లేదు. ఈ నెల 26న బాధితుల ఇంట్లో వివాహం ఉండడంతో ఆయన్ను సంప్రదించినా స్పందించడం లేదు. దీంతో ఆదివారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇటీవల అజయ్ జ్యూవెలర్స్ యజమాని సైతం సూమారు రూ.కోటి ఆస్తులతో పరారవ్వగా నేటికీ ఆచూకీ లభించలేదు. ప్రైవేట్ వ్యక్తులను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.


