● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక
● చెంచుపల్లిలో న్యాయ అవగాహన సదస్సు
పూడూరు: చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, అప్పుడే రక్షణ పొందగలుగుతారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి ఎ.రాధిక అన్నారు. శుక్రవారం మండలంలోని చెంచుపల్లి గ్రామంలో అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని తెలిపారు. గృహహింస, బాల్యవివాహాలు, మహిళా చట్టాలు, బాలల హక్కులు, సైబర్ నేరాలు వంటి వాటిని లోక్ అదాలత్‌ల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. న్యాయ పరమైన సమస్యలు ఎదురైనప్పుడు సంస్థను సంప్రదిస్తే ఉచిత న్యాయ సహాయం అందుతుందన్నారు. చెంచుపల్లిలో ప్రభుత్వ భూముల సమస్య తమ దృష్టికి వచ్చిందని, బాధితులు దరఖాస్తు చేస్తే న్యాయం జరిగేలా చూస్తామన్నారు. యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అంకిత సంస్థ ఆధ్వర్యంలో బ్యాగులు అందజేశారు. కార్యక్రమంలో చన్గోముల్ ఎస్‌ఐ భరత్‌రెడ్డి, సర్పంచ్ దయాకర్, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వెంకటేశ్, అంకిత స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాష్, ఉపసర్పంచ్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


