కొందుర్గు: మండలంలోని ఉమ్మెంత్యాల గ్రామంలో రోడ్డుకు అడ్డంగా నిలిపిన ట్రాక్టర్‌ను తొలగించాలని కోరిన గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు బేగరి యాదయ్యపై దాడి జరిగిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. చెత్త సేకరణ కోసం ట్రాక్టర్‌తో గ్రామంలోకి వెళ్లిన యాదయ్యకు, కబీరు భూషయ్య తన ట్రాక్టర్‌ను రోడ్డుపై నిలిపి ఎరువుల బస్తాలు దింపుతున్నాడు. బస్తాలు దింపిన అనంతరం కూడా ట్రాక్టర్‌ను తొలగించకపోవడంతో యాదయ్య దానిని పక్కకు తీసేయాలని కోరాడు. దీంతో భూషయ్య, అతని కుమారుడు వీరేశం కలిసి యాదయ్యపై దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవీందర్ నాయక్ తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికుడిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు పోలీసులకు వినతిపత్రం అందజేశారు.


