బషీరాబాద్: పాత పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నంద్యానాయక్‌తండాకు చెందిన మాజీ సర్పంచ్ రాథోడ్ శంకర్ శుక్రవారం బషీరాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో హల్‌చల్ చేశాడు. ప్రస్తుత సర్పంచ్ సుమ్మీబాయి, ఆమె భర్త శ్రీనునాయక్ తన బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగాడు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హడలెత్తించాడు. దీంతో కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అంతేకాకుండా అధికారులపై దుర్భాషలాడుతూ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం సృష్టించాడు. ఇదిలా ఉండగా తనను చంపేస్తానని శంకర్ రాథోడ్ బెదిరించాడని పంచాయతీ కార్యదర్శి దశరథ్ ఎంపీడీఓ సంపత్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన పోలీసులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మాజీ సర్పంచ్‌ను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.


