విదేశీ పర్యటనలో టీఆర్‌ఆర్‌ | - | Sakshi
Sakshi News home page

విదేశీ పర్యటనలో టీఆర్‌ఆర్‌

Aug 8 2026 8:37 AM | Updated on Aug 8 2026 8:37 AM

విదేశీ పర్యటనలో టీఆర్‌ఆర్‌ గ్రామకమిటీల ఎన్నిక అనంతగిరికి భక్తుల తాకిడి ముర్రుపాలలో రోగనిరోధక శక్తి ఎరువుల పంపిణీకి ప్రత్యేక యాప్‌ పాముకాటుతో వలస కూలీ మృతి

పరిగి: అమెరికా పర్యటనలో పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి బీజీగా ఉన్నారు. ఆటా(అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) మహాసభలో ప్రభుత్వం తరుఫున మంత్రులతో కలిసి ఆయన పాల్గొన్నారు. అక్కడి తెలుగు వారితో ఈ నెల 10వ తేదీ వరకు ముగియనున్న సర్‌ కార్యక్రమంపై చర్చించారు. జూమ్‌ మీటింగ్‌ ద్వారా ఎన్యుమరేషన్‌ ఫారం పూరించి, ఆన్‌లైన్‌ విధానంతో తదితర అంశాలపై వారికి అవగాహన కల్పించానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పారిశ్రామిక వేత్తలైన ప్రవాస భారతీయులతో మాట్లాడానని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు వివరించారు.

బొంరాస్‌పేట: మండల పరిధి గ్రామాల్లో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు జరిగాయి. లింగన్‌పల్లి గ్రామ అధ్యక్షుడిగా ఈడ్గి రమేశ్‌, జానకంపల్లి– గోపాల్‌, మహంతీపూర్‌– తలారి అంజిలయ్య, వడిచర్ల– రఘునందన్‌రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇందులో సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి, పార్టీ నాయకులు మహిపాల్‌, కాశప్ప, జానకంపల్లి అంజిలయ్యలు ఉన్నారు.

అనంతగిరి: వికారాబాద్‌ అనంతగిరిగుట్టకు శుక్రవారం పర్యాటకులు తరలివచ్చారు. అనంతపద్మనాభ స్వామిని, బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇందులో తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యురాలు పరిపూర్ణ, నిజామాబాద్‌కు చెందిన 22 మంది మహిళా న్యాయవాదులు ఉన్నారు.

మర్పల్లి: ముర్రుపాలలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందని బూచన్‌పల్లి సర్పంచ్‌ వెంకట్‌రామ్‌ రెడ్డి అన్నారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవంలో ఆయన మాట్లాడారు. పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రు పాలు పట్టించాలని సూచించారు. ఉప సర్పంచ్‌ శెఖుల్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు అనుసూజ, సరోజ, ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు.

బొంరాస్‌పేట: రైతులకు ఎరువుల పంపిణీని మరింత పాదర్శకం, సులభతరం చేసేందుకు నూతనంగా ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌) యాప్‌ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని దుద్యాల మండల వ్యవసాధికారి తులసి తెలిపారు. శుక్రవారం దుద్యాల మండలం హకీంపేట, పోలెపల్లి గ్రామాల్లో ఫర్టిలైజర్‌ దుకాణ నిర్వాహకులకు అవగాహన కల్పించారు.

కొందుర్గు: పొట్టకూటి కోసం వందల మైళ్లు దాటుకొని వచ్చి జీవన పోరు సాగిస్తున్న ఓ వలస కూలీని పాముకాటు బలిగొంది. ఈ విషాదకర సంఘటన శుక్రవారం కొందుర్గులో చోటుచేసుకుంది. ఎస్సై రవీందర్‌నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూల్‌ జిల్లా పత్తికొండ మండలం పులికొండ గ్రామానికి చెందిన శాంతమ్మ(45), రంగస్వామి దంపతులు. వీరితోపాటు మరో పదిమంది వారం రోజుల క్రితం కూలి పనుల కోసం లూర్దునగర్‌కు చెందిన పోతిరెడ్డి శౌరెడ్డి వద్దకు వచ్చారు. శుక్రవారం అందరూ కలిసి ఉమ్మెంత్యాల గ్రామంలో శౌరెడ్డికి చెందిన కౌలుకు తీసుకొని సాగుచేసిన పత్తి పంటలో కలుపు తీయడానికి వెళ్లారు. ఈ క్రమంలో మధ్యాహ్నం శాంతమ్మను పెంజర పాము కాటు వేసినట్లు తోటి కూలీలు గమనించారు. వెంటనే చికిత్స కోసం కొందుర్గు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement