అభ్యంతరాలుంటే తెలపండి | - | Sakshi
Sakshi News home page

అభ్యంతరాలుంటే తెలపండి

Aug 8 2026 8:37 AM | Updated on Aug 8 2026 8:37 AM

అభ్యంతరాలుంటే తెలపండి 10నుంచి రైల్వే గేటు మూసివేత ఘర్షణకు దిగిన 15మంది బైండోవర్‌ లారీ ఢీకొని ఆవు మృతి బైక్‌ ఢీకొని వ్యక్తికి గాయాలు

అనంతగిరి: ల్యాబ్‌ టెక్నీషియన్‌, సూపర్‌వైజర్‌ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజినల్‌ జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరిచినట్లు డీఎంహెచ్‌ఓ సుధాకర్‌ లాల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్‌ టెక్నీషియన్‌, సూపర్‌వైజర్‌పోస్టుల కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అభ్యర్థుల ప్రొవిజినల్‌ జాబితాను డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో పొందుపరచడం జరిగిందన్నారు. సెలవు దినాల్లో కూడా ఆఫీసు పనివేళలల్లో అభ్యంతరాలను స్వీకరించడానికి సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.

నవాబుపేట: మండలంలోని గొల్లగూడ రైల్వే స్టేషన్‌ గేటు ఏడు రోజులపాటు మూసి వేయనున్నట్లు ఆ శాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10నుంచి 17వ తేదీ వరకు స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాక్‌ మరమ్మతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎందుకు గాను ఏడు రోజులపాటు రైల్వే గేటును మూసి వేస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు వివిధ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

శంకర్‌పల్లి: బండ్ల బోనాల జాతరలో ఘర్షణకు దిగిన 15 మందిని శంకర్‌పల్లి పోలీసులు శుక్రవారం బైండోవర్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు ఫత్తేపూర్‌లో ఈనెల 6నుంచి 10వ తేదీ వరకు బండ్ల బోనాల జాతర నిర్వహిస్తున్నారు. గురువారం వార్డులోని రెండు వర్గాల మధ్యన ఘర్షణ తలెత్తింది. రంగంలోకి దిగిన పోలీసులు వారికి చెదరగొట్టారు. శుక్రవారం మళ్లీ గొడవ జరగ్గా.. పోలీసులు 15మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చేవెళ్ల కోర్టు అనుమతితో వారిని తహసీల్దార్‌ ముందు హాజరు పరిచి, బైండోవర్‌ చేసి వదిలేశారు. మళ్లీ గొడవలకు దిగితే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు.

కేశంపేట: మండల పరిధిలోని అల్వాల గ్రామ శివారులోని తులవానిగడ్డ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు దాటుతున్న ఆవుల మందను లారీ ఢీకొన్న ఘటనలో ఒక ఆవు మృతి చెందింది. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. తులవానిగడ్డకు చెందిన సంగనమోని నరేష్‌ వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.ఉదయం ఆవుల మంద రోడ్డు దాటుతుండగా ఎక్లాస్‌కాన్‌పేట నుంచి కేశంపేట వైపు వెళ్తున్న లారీ వాటిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. లారీని నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని, ఆవు మృతికి కారణమైన లారీ డ్రైవర్‌ సాబేర్‌పై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నరహరి తెలిపారు.

కేశంపేట: పొలం నుంచి ఇంటికి వచ్చేందుకు రోడ్డు పక్కన నిల్చున్న ఓ వ్యక్తిని బైక్‌ ఢీకొట్టడంతో గాయాలైన సంఘటన మండల పరిధిలోని తొమ్మిదిరేకుల గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి నర్సింహారెడ్డి తన పొలం వద్ద నుంచి ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం రోడ్డుపైన నిల్చున్నాడు. అటువైపు నుంచి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ని ఢీకొట్టారు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయమై బాధితుడి కుమారుడు రాజేందర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నరహరి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement