మహేశ్వరం: శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు పోలీసులు నిరంతరం కృషి చేయాలని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం తుక్కుగూడలోని మహేశ్వరం జోన్ డీసీపీ కార్యాలయంలో ఏసీపీలు, సీఐలతో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించి నేరరహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన పాత పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, దర్యాప్తును వేగవంతం చేసి సకాలంలో చార్జిషీటు దాఖలు చేయాలని సూచించారు. ముఖ్యంగా పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, మహిళలపై నేరాలు, పీడీ యాక్ట్, రౌడీషీటర్ల వ్యవహారాలు, సైబర్ నేరాలు, సీసీటీవీ కవరేజ్, కాల్ డిటైల్ రికార్డులు (సీడీఆర్), గ్రేవ్ కేసుల దర్యాప్తును ప్రాధాన్యతగా పూర్తి చేయాలని సీఐలను ఆదేశించారు. అలవాటుగా నేరాలకు పాల్పడే వ్యక్తులపై సమర్థవంతమైన నిఘా, సీసీటీవీ వ్యవస్థల బలోపేతం, విజిబుల్ పోలీసింగ్ అమలు, శాంతిభద్రతల కట్టుదిట్టమైన నిర్వహణపై అన్ని ఎస్‌హెచ్‌ఓలకు దిశానిర్దేశం చేశారు. కేసుల ఛేదన రేటును పెంచేందుకు వృత్తిపరమైన, ఫలితాల ఆధారిత దర్యాప్తు విధానాన్ని అనుసరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, మహేశ్వరం జోన్‌కు చెందిన సీఐలు తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి


